సీఎం కేజ్రీవాల్‌ కస్టడీ.. ఈడీ రిమాండ్‌ రిపోర్టులోనూ కవిత ప్రస్తావన

by Hajipasha |
సీఎం కేజ్రీవాల్‌ కస్టడీ.. ఈడీ రిమాండ్‌ రిపోర్టులోనూ కవిత ప్రస్తావన
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను 7 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్‌ను కోర్టులో ఈడీ తిరిగి హాజరుపర్చనుంది. అంతకుముందు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ.. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఈ క్రమంలోనే 28 పేజీల రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ పాత్రను కోర్టుకు వివరించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌‌ను ప్రధాన కుట్రదారుడిగా పేర్కొన్న ఈడీ.. ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది.

ఈడీ తరఫు వాదనలివీ..

‘సౌత్ గ్రూప్’కు, లిక్కర్ స్కాంలోని నిందితులకు మధ్య కేజ్రీవాల్ మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ తరఫు న్యాయవాది, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు పేర్కొన్నారు. ‘‘మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్‌. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు సౌత్ గ్రూప్ నుంచి నుంచి ఆయన కోట్లాది రూపాయల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లను కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి ఆయనకు వచ్చాయి’’ అని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ‘‘లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ పాత్రపై మరో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి వాంగ్మాలం తీసుకున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.100 కోట్లది కాదని రూ. 600 కోట్ల కుంభకోణం. విజయ్‌ నాయర్‌ కంపెనీ నుంచి అన్ని ఆధారాలు సేకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ, సౌత్‌ గ్రూప్‌‌లకు విజయ్‌ నాయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు’’ అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు తెలిపారు.

కేజ్రీవాల్ తరఫు వాదనలివీ..

కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘‘కేజ్రీవాల్ అరెస్ట్‌ అక్రమం. ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో ఈడీ చెప్పాలి. అప్రూవర్‌గా మారి సాక్ష్యం చెప్పిన వ్యక్తికి క్రెడిబిలిటీ లేదు. సాక్షాలన్నీ ఉండగా మళ్లీ కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వడం ఎందుకు ? ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు అవసరం లేదు. అధికారాన్ని ఈడీ దుర్వినియోగం చేస్తోంది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా లిక్కర్ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఏమీ లేవు. ఎలాంటి మెటీరియల్‌ ఆధారాలు లేకుండానే.. కేజ్రీవాల్‌ను ఈడీ అక్రమంగా, ఏకపక్షంగా అరెస్టు చేసింది’’ అని పేర్కొన్నారు. ఈడీ రిమాండ్‌ అభ్యర్థనను తిరస్కరించాలని అభిషేక్ మను సింఘ్వీ చేసిన రిక్వెస్టును కోర్టు తిరస్కరించింది. మొత్తం మీద ఇరుపక్షాల వాదనలు రెండున్నర గంటల పాటు వాడివేడిగా కొనసాగాయి. వీటిని విన్న న్యాయమూర్తి శుక్రవారం సాయంత్రం తీర్పును వెలువరించారు. కేజ్రీవాల్‌ను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.

నా జీవితం దేశానికి అంకితం : కేజ్రీవాల్

శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీఎం కేజ్రీవాల్‌ను హాజరుపర్చేందుకు ఈడీ అధికారులు తీసుకెళ్తుండగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కేజ్రీవాల్‌ స్పందించారు. ‘‘నా జీవితం దేశం కోసం అంకితం. జైలు లోపల ఉన్నా.. బయట ఉన్నా దేశ సేవ చేస్తూనే ఉంటా’’ అని ఆయన తెలిపారు.

సుప్రీం నుంచి అత్యవసర విచారణ పిటిషన్ విత్‌డ్రా

ఇక ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం రాత్రి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు.కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నందున పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్ దిగువ న్యాయస్థానం (రౌస్ అవెన్యూ కోర్టు)లో రిమాండ్‌ను ఎదుర్కొంటారని, అవసరమైతే సుప్రీం కోర్టును మరో పిటిషన్‌తో ఆశ్రయిస్తారని అభిషేక్ మనుసింఘ్వీ చెప్పారు. రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం విచారణ ఉన్నందున.. సుప్రీంలో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.దీంతో అందుకు సుప్రీంకోర్టు బెంచ్ అనుమతి మంజూరు చేసింది.

Advertisement

Next Story