Excise Policy Case: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

by Shamantha N |
Excise Policy Case: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ వేశారు. సీబీఐ అరెస్టు, రిమాండ్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ విషయాన్ని అత్యవసర విచారణ కోసం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించారు. అయితే, రిజిస్ట్రీకి ఈమెయిల్ పంపాలని.. అప్పుడు పరిశీలిస్తామని సీజేఐ చెప్పారు.

లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ అరెస్టుని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే, ఎన్నికల కోసం కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. కాగా ఈడీ అరెస్టు కేసులో సుప్రీంకోర్టు సీఎంకు జులై 12న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఇదే కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేయడంతో ప్రస్తుతం జైల్లోనే కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఇక్కడి కోర్టు ఆగస్టు 20 వరకు పొడిగించింది.

Advertisement

Next Story

Most Viewed