సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట.. మధ్యంత బెయిల్ మంజూరు

by Shamantha N |
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట.. మధ్యంత బెయిల్ మంజూరు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తన అరెస్టుని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏప్రిల్ 9న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై ఈడీ, కేజ్రీవాల్ తరఫు వాదనలు విన్నసుప్రీం ధర్మాసనం మే 17న తీర్పుని రిజర్వ్ చేసింది. కాగా.. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పుని ఇచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎంగా కేజ్రీవాల్ ను తొలగించాలన్న డిమాండ్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన సీఎం పదవి చేపట్టారని వ్యాఖ్యానించింది. అరెస్టు అయ్యారు కాబట్టి.. సీఎం పదవికి రాజీనామా చేయాలా వద్దా అనే నిర్ణయం కేజ్రీవాల్ దే అని స్ఫష్టం చేసింది. కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీ అధికారాలపై కొన్ని ప్రశ్నలు అడిగిన కోర్టు.. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణను విస్తృత ధర్మాసనానికి పంపింది.

బెయిల్ వచ్చినా ఇంకా జైలులోనే..

ఇకపోతే, మధ్యంతర బెయిల్ దక్కినా కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. సీబీఐ కేసులో ఆయన అరెస్టు అవడంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు. మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు. ఈ కేసులో జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత జూన్ 25న బెయిల్ పై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ అరెస్టు అయ్యారు. జూన్‌ 27 నుంచి సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

సత్యమేవ జయతే- ఆప్

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత"సత్యమేవ జయతే" అని ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో రాసుకొచ్చింది. ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఈడీపై ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ను ఈడీ అక్రమ కేసులో ఇరికించిందని ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు సహా అందరూ విశ్వసిస్తున్నారని తెలిపారు. “మోడీజీ, తప్పుడు కేసులు పెట్టి సత్యాన్ని ఎంతకాలం జైలులో ఉంచుతారు? దేశం మొత్తం మీ నియంతృత్వాన్ని చూస్తోంది' అని హిందీలో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుతో సత్యం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed