Article 370 hearing: 'రాష్ట్ర హోదాను ఎప్పుడు పునరుద్ధరిస్తారు..?'

by Vinod kumar |
Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi
X

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఎప్పట్లోగా పునరుద్ధరిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ పని కోసం రోడ్ మ్యాప్‌ను తెలపాలని మంగళవారం కోరింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు రోజువారీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌కు కేంద్రపాలిత ప్రాంతం హోదా తాత్కాలికమేనని, రాష్ట్ర హోదాను ఎప్పట్లోగా పునరుద్ధరిస్తారనే విషయాన్ని ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నెల 31వ తేదీన తెలియజేస్తానని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

అయితే.. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్, లడఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019లో కేంద్రం తీసుకొచ్చిన జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల రోజువారీ విచారణ ప్రారంభమైంది.

జమ్మూకశ్మీర్‌కు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రస్తుత పరిస్థితి తాత్కాలిక చర్య అని, దాని రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన విషయాన్ని సుప్రీం ధర్మాసనానికి తుషార్ మెహతా తెలిపారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం అత్యున్నత పీఠంపై ఉన్న భారత రాజ్యాంగానికి ‘అధీనమైనది’ అని కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌తో సుప్రీం కోర్టు ప్రాథమికంగా అంగీకరించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక నిబంధనలు ‘వివక్ష కాదు.. ప్రత్యేక హక్కు’ అని రాష్ట్ర ప్రజలను రెండు ప్రధాన పార్టీలు తప్పుదారి పట్టించాయని కేంద్రం తెలిపింది. ఆ రెండు పార్టీలు ఇప్పుడు కూడా ఆర్టికల్ 370, 35ఎ లను సమర్ధిస్తున్నాయని సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు చెప్పారు.

Advertisement

Next Story