మహారాష్ట్రలో బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్: దేశంలో అక్రమంగా ఉంటున్నట్టు గుర్తింపు

by samatah |
మహారాష్ట్రలో బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్: దేశంలో అక్రమంగా ఉంటున్నట్టు గుర్తింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను మహారాష్ట్రలోని ముంబైలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. 24 ఏళ్ల వయసుగల ఇద్దరు వ్యక్తులను పన్వెల్‌లోని నద్వే వద్ద అదుపులోకి తీసుకున్నట్టు ఏటీఎస్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఖిదుక్‌పాడ గ్రామంలో ఏటీఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించే క్రమంలో వీరిని గుర్తించారు. అనంతరం వారిని విచారించగా..దేశంలో అక్రమంగా ఉంటున్నట్టు వెల్లడైంది. భారత్‌లోకి రావడానికి ఉపయోగించిన సరైన పత్రాలను సైతం చూపించకపోవడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు పౌరుల పేర్లపై ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌ ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరిపై పాస్‌పోర్ట్ రూల్స్-1950, విదేశీయుల చట్టం కింద కేసు నమోదు చేశారు. పౌరులిద్దరు ఎప్పటి నుంచి ఇండియాలో ఉంటున్నారు, అక్రమ ఇమ్మిగ్రేషన్‌ నెట్‌వర్క్‌తో ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా, గతేడాది డిసెంబర్‌లోనూ ముంబైలోని సెవ్రీ ప్రాంతంలో 9మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సైతం వివిధ నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ముంబైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్ పంపినందుకు గుర్తు తెలియని వ్యక్తిపై బాంద్రా కుర్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story