వారికి తెలియకుండానే బీజేపీ సభ్యులైన కంటి పేషెంట్లు

by Mahesh Kanagandla |
వారికి తెలియకుండానే బీజేపీ సభ్యులైన కంటి పేషెంట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ కంటి ఆస్పత్రిలో పడుకున్న పేషెంట్‌లను లేపి.. వారికి తెలియకుండానే వారిని బీజేపీ సభ్యులుగా చేసినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మొబైల్ నెంబర్ అడిగి ఓటీపీ తీసుకుని పేషెంట్ల సమ్మతం లేకుండానే పార్టీ సభ్యత్వం ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా 350 మంది కంటి పేషెంట్లకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అదే హాస్పిటల్‌లో ఉన్న ఓ పేషెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ వార్తను గుజరాత్ బీజేపీ ఖండించింది.

గుజరాత్‌లో రాజ్‌కోట్‌లోని రాంఛోడ్ దాస్ ట్రస్ట్ హాస్పిటల్‌లో రాత్రిపూట పేషెంట్లు పడుకుని ఉన్నారు. కంటి ఆపరేషన్ కావడంతో రెస్ట్ తీసుకుంటున్నవారు కూడా ఆ 350 మందిలో ఉన్నారు. ఇంతలో అక్కడికి ఓ వ్యక్తి వరుసగా ఒక బెడ్ తర్వాత మరో బెడ్ వద్దకు వెళ్లుతూ మొబైల్ నెంబర్ అడిగి.. ఓటీపీని కూడా తీసుకుని వారికి బీజేపీ సభ్యత్వం ఇవ్వడం మొదలు పెట్టాడు. జునాగడ్‌కు చెందిన కమలేశ్ తుమ్మర్‌ను కూడా నిద్ర లేపి ఇలాగే మొబైల్ నెంబర్ అడగ్గా చెప్పాడు. ఓటీపీని చెప్పమంటే చెప్పాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌కు ఓ మెస్సేజీ వచ్చింది. ‘మీరు బీజేపీ సభ్యులు అయ్యారు’ అని మెస్సేజీ రావడంతో కమలేశ్ తుమ్మర్ ఆ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. చివరకు తాను బీజేపీ సభ్యత్వం ఇస్తున్నట్టు ఆ వ్యక్తి అంగీకరించాడని కమలేశ్ పేర్కొన్నాడు. ఇది లేకుండా ఎవరూ బతుకలేరు అని ఆ వ్యక్తి తనకు చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. అప్పుడే ఈ వ్యవహారాన్ని వీడియో తీసి వైరల్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించాడు.

ఈ పరిణామంపై రాంఛోడ్ దాస్ హాస్పిటల్ అధికారి శాంతి బదోలియా స్పందిస్తూ ఆ వ్యక్తి తమ సిబ్బంది కాదని, ఏ పేషెంట్ కోసమో ఆయన హాస్పిటల్ వచ్చి ఉంటాడని, తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని వివరించాడు. ఇక గుజరాత్ బీజేపీ ఉపాధ్యక్షఉడు గోర్దన్ జదాఫియా ఈ ఆరోపణలను ఖండించారు. ఇందులో తమ పార్టీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ పద్ధతిలో సభ్యత్వం సేకరించాలని తాము ఎవరినీ ఆదేశించలేదని, ఇందులో తమ పార్టీ ప్రమేయమే లేదని పేర్కొన్నారు. ఒక వేళ అలాంటి ఘటన నిజంగానే జరిగి ఉంటే తాము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Advertisement

Next Story