J&K: లోయలో పడ్డ సైనికుల గస్తీ వాహనం.. ఒక జవాన్ మృతి

by Harish |   ( Updated:2024-09-21 14:56:08.0  )
J&K: లోయలో పడ్డ సైనికుల గస్తీ వాహనం.. ఒక జవాన్ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సైనికులు గస్తీ నిర్వహిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కథువా జిల్లాలో మారుమూల ప్రాంతంలో సైనికులు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో మాచెడి-బిల్లవార్ రోడ్డులోని సుక్రాలా దేవి ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులతో సహా రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ప్రమాదంలో రామ్‌కిషోర్ అనే సైనికుడు మృతి చెందాడు. గాయపడిన ఏడుగురు సైనికులను ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంలో మరణించిన జవాన్ చిత్రపటానికి ఆర్మీకి చెందిన రైజింగ్ స్టార్ కార్ప్స్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ఉండగా ధైర్యశాలి రామ్‌కిషోర్ అకాలంగా మరణించడం చాలా దురదృష్టకరం. రైజింగ్ స్టార్ కార్ప్స్ విచారం వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో భారత సైన్యం అతని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలుస్తుందని పోస్ట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే, నిన్న బుద్గామ్ జిల్లాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు బ్రెల్ వాటర్‌హైల్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి 40 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత తాజాగా మరో ప్రమాదం జరగడం గమనార్హం.

Advertisement

Next Story