ప్రైవేటు ఆస్తులు సమాజ వనరులా ? ‘సుప్రీం’ తీర్పు రిజర్వ్

by Hajipasha |   ( Updated:2024-05-02 11:23:18.0  )
ప్రైవేటు ఆస్తులు సమాజ వనరులా ? ‘సుప్రీం’ తీర్పు రిజర్వ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రైవేటు ఆస్తి సమాజ వనరా ? కాదా ? అనే క్లిష్టమైన అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎదుట బుధవారం కూడా వాదనలు కొనసాగాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహా పలువురు ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముంబైకి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ (పీఓఏ) 1992లో దాఖలు చేసిన లీడ్ పిటిషన్‌‌తో పాటు మొత్తం 16 పిటిషన్లను కలిపి ఈ ధర్మాసనం విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రైవేట్ ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించవచ్చా ? లేదా ? అనే దానిపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. బుధవారం వాదనలు ముగియడంతో ఈ కేసుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బెంచ్ వెల్లడించింది.

వాదనల సందర్భంగా మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ చట్టంలోని చాప్టర్ VIII-Aని ముంబై ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘చాప్టర్ VIII-Aలోని నిబంధనల వల్ల కాలం చెల్లిన ఏదైనా భవనంలో నివసించేవారిలో 70 శాతం మంది రిక్వెస్ట్ మేరకు.. దాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి వస్తుంది. దీనివల్ల అసలు యజమానులు నష్టపోతారు’’ అని పీఓఏ వాదించింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ చట్టంలోని నిబంధనలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 31సీ ద్వారా రక్షణ ఉందన్నారు. ఈ చట్టంలోని చాప్టర్ VIII-Aను తొలగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read More..

వావ్ ఎంత అద్భుతంగా ఉందో.. విస్టాడోమ్ కోచ్‌లతో ప్రత్యేక రైళ్లు..

Advertisement

Next Story

Most Viewed