Anti rape bill: ‘అపరాజిత’ బిల్లు పనికిరానిది.. సీపీఎం ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్య

by vinod kumar |
Anti rape bill: ‘అపరాజిత’ బిల్లు పనికిరానిది.. సీపీఎం ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్య
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక దాడి నిందితులను శిక్షించేందుకు ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు-2024’ పేరుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీపీఎం ఎంపీ, ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన ఘటనలో బాధిత కుటుంబం తరఫు న్యాయవాది బికాష్ రంజన్ భట్టాచార్య స్పందించారు. ఈ బిల్లు పూర్తిగా పనికిరానిదని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే దీనిని తీసుకొచ్చారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించడం కంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా బిల్లు ఉందన్నారు.

ప్రభుత్వానికి ఉన్న శాసనాధికారం ప్రకారం బిల్లును రూపొందించారని, కానీ దీని వల్ల ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. ఏ విచారణ సంస్థ కూడా నిర్థిష్ట సమయంలో తన పనిని పూర్తి చేయడం వీలుకాదని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించబోదని.. దీనిని తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. మమతా బెనర్జి పరిపాలన పట్ల ప్రజలు పూర్తిగా విసుగు చెందారని మండిపడ్డారు. తమ రక్షణపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. అందుకే ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story