వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు మరో పార్టీ మద్దతు: కోవింద్ కమిటీకి కీలక సూచనలు

by samatah |
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు మరో పార్టీ మద్దతు: కోవింద్ కమిటీకి కీలక సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు బిహార్‌లోని అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) మద్దతు తెలిపింది. ఈ అంశంపై అధ్యయనానికి గానూ కేంద్ర ప్రభుత్వం నియమించిన కోవింద్ కమిటీకి మొమోరాండం అందజేసింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపింది. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు అంగీకరిస్తున్నామని కానీ.. స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం వేరుగానే నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని తెలిపింది. స్థిరమైన ఎన్నికల కారణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎటువంటి అంతరాయాలు లేకుండా ఎక్కువ కాలం పదవిలో ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అంతేగాక ఎన్నికల ప్రచారానికి సమయం తగ్గడంతో నాయకులు స్వల్పకాలిక ఎన్నికల పరిశీలనల కంటే పాలన, విధాన రూపకల్పనపై దృష్టి సారించే చాన్స్ ఉందని వెల్లడించింది. కోవింద్ కమిటీని కలిసిన వారిలో జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఝా ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కోవింద్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై రాజకీయ పార్టీలు, ప్రముఖుల అభిప్రాయాలను సేకరిస్తోంది.

Advertisement

Next Story