"పప్పా.. ప్లీజ్ తిరిగి రా".. ఉగ్రదాడిలో అమరుడైన జవాన్ కూతురి ఎమోషనల్ కామెంట్

by Mahesh |
పప్పా.. ప్లీజ్ తిరిగి రా.. ఉగ్రదాడిలో అమరుడైన జవాన్ కూతురి ఎమోషనల్ కామెంట్
X

దల్పత్ (కాశ్మీర్) : "పప్పా.. నువ్వు ఎందుకు లేవటం లేదు? నాకేం వద్దు ..నువ్వు లే పప్పా !! ప్లీజ్ పప్పా.. నువ్వు తిరిగి వచ్చెయ్ !! " అంటూ జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడిలో అమరుడైన హవల్దార్ నీలం సింగ్ పదేళ్ల కూతురు పవనా చిబ్ వెక్కి వెక్కి ఏడ్చింది. త్రివర్ణ పతాకం చుట్టిన శవపేటికలో నీలం సింగ్ మృతదేహం.. శనివారం ఆయన స్వగ్రామం దల్పత్ - చక్ కృపాల్‌పూర్ గ్రామానికి చేరుకుంది. శవపేటిక వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన పవనా.. అద్దం నుంచి తండ్రి మొహాన్ని టచ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఎమోషనల్ అయి గుక్క తిప్పుకోకుండా ఏడ్చింది. తన కూతురి ఏడుపును, భర్త మృతదేహాన్ని చూసిన.. హవల్దార్ నీలం సింగ్ భార్య వందనకు ఏడుపు ఆగలేదు.

భర్త ముఖాన్ని కడసారి చూసుకుంటూ ఆమె ఎంతో ఎమోషనల్ అయింది. హవల్దార్ ఏడేళ్ల కుమారుడు అంకిత్ కూడా ఓదార్చలేని స్థితిలో ఉన్నాడు. వందన తన భర్తకు చివరిసారిగా నమస్కరిస్తున్నప్పుడు "నీలం సింగ్ అమర్ రహే" అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు . పూర్తి సైనిక లాంఛనాలతో నీలం సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ లో జవాన్ గా సేవలందిస్తున్న సోదరుడు అంగద్ సింగ్ .. నీలం సింగ్ చితికి నిప్పు అంటించాడు. తండ్రి హర్దేవ్ సింగ్ చిబ్.. చివరిసారిగా నీలం సింగ్ ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తన కొడుకును తలచుకొని గర్వపడుతున్నానని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed