సరెండర్ దిశగా అమృత్ పాల్ సింగ్.. నేపాల్ నుంచి తిరిగి పంజాబ్ రాక..?

by Satheesh |
సరెండర్ దిశగా అమృత్ పాల్ సింగ్.. నేపాల్ నుంచి తిరిగి పంజాబ్ రాక..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా అరెస్ట్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆయన తాజాగా పోలీసులకు సరెండర్ అయ్యేందుకు సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్ లో ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పెంచి పోషించేందుకు దేశ అంతర్గత శక్తులతో కలిసి కుట్ర పన్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. పలు క్రిమినల్ కేసుల్లోనూ అమృత్ పాల్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు. గత నెల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఎస్పీతో పాటు పలువురు పోలీసులపై దాడి చేసి అతడి మద్దతుదారులను విడిపించుకుపోయాడు.

అప్పటి నుంచి అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అమృత్ పాల్ సింగ్ మాత్రం హర్యానా మీదుగా ఢిల్లీ నుంచి నేపాల్‌కు చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. అయితే తాజాగా ఆయన పోలీసులకు లొంగిపోయే నిమిత్తం పంజాబ్‌కు తిరిగి వచ్చాడని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. లొంగిపోయేందుకు ముందుగా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. తాను తప్పించుకునే అవకాశం లేదని గ్రహించే సరెండర్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో గ్రామాలను జల్లెడ పడుతున్నారు. కార్డన్ సెర్చ్‌లు ప్రారంభించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బారికేడ్లను పెంచారు.

Advertisement

Next Story