అమిత్ షాకే హోం శాఖ!.. మాజీ సీఎంలు శివరాజ్, ఖట్టర్ పేర్లు కూడా తెరపైకి

by vinod kumar |
అమిత్ షాకే హోం శాఖ!.. మాజీ సీఎంలు శివరాజ్, ఖట్టర్ పేర్లు కూడా తెరపైకి
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ సర్కార్ ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ మంత్రుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తం 30 మంది మంత్రులు మోడీతో పాటు ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తుండగా..అమిత్ షాకు మళ్లీ హోం శాఖ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తొలిసారి కేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నారు. దీంతో వీరికి కూడా పెద్ద బాధ్యతలే అప్పగించనున్నట్టు సమాచారం. ఒక వేళ అమిత్ షాకు హోం శాఖ దక్కకుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఆ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక, రాజ్‌నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా, నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

మోడీ కేబినెట్‌లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు 8 మంది, మధ్యప్రదేశ్‌ నుంచి ఐదుగురు, రాజస్థాన్ నుంచి నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కినట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పంజాబ్‌లోని లూథియానా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టుకు కూడా మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. మరోవైపు ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రి పదవి విషయంలో అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలో పోరు సాగుతున్నట్టు తెలుస్తోంది. తమకు కేబినెట్‌లో చోటు దక్కక పోవడంతో అజిత్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

నడ్డాకు బెర్త్ ఖాయం!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ చీఫ్ గా నడ్డా పదవీ కాలం త్వరలోనే ముగియనుంది, దీంతో ఆయన మరోసారి ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా లేరని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నడ్డాకు కేబినెట్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆయనకు ప్రస్తుతం అవకావం కల్పిస్తారా లేక మంత్రివర్గ విస్తరించే సమయంలో చాన్స్ ఉంటుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, 2014 నుంచి 2019 వరకు మోడీ మొదటి కేబినెట్‌లో నడ్డా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రిగా పని చేశారు. 2020లో బీజేపీ చీఫ్‌గా నియామకమయ్యారు.

Advertisement

Next Story