మణిపూర్‌లో శాంతి నెలకొనాలి.. త్వరలో రాష్ట్రాన్ని సందర్శించనున్న అమిత్ షా

by Vinod kumar |
మణిపూర్‌లో శాంతి నెలకొనాలి.. త్వరలో రాష్ట్రాన్ని సందర్శించనున్న అమిత్ షా
X

గౌహతి: మణిపూర్‌లో శాంతి నెలకొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం విజ్ఞప్తి చేశారు. త్వరలో ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించి హింసలో పాల్గొన్న రెండు వర్గాల ప్రజలతో మాట్లాడతానని ఆయన చెప్పారు. ‘కోర్టు తీర్పు తర్వాత మణిపూర్‌లో హింస చెలరేగింది. ఇరు వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి నెలకొనాలి. అందరికీ న్యాయం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత నేను మణిపూర్‌కు వెళతాను. మూడ్రోజులు అక్కడే ఉండి శాంతి స్థాపన కోసం ఆ రాష్ట్ర ప్రజలతో మాట్లాడతాను’ అని గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. మణిపూర్‌లో తాజాగా జాతి హింస చెలరేగినట్లు అధికారులు గురువారం తెలిపారు.

ఈ ఘటనలో ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ నెల జరిగిన మతాంతర హింసా కాండతో మణిపూర్ అట్టుడికిపోయింది. దాదాపు 70 మంది మరణించగా.. పది వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల ఇళ్లు తగులబడ్డాయి. మెజారిటీ కమ్యూనిటీ మైతీకి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ప్రోత్సాహకాలపై హామీ ఇవ్వడంతో కుకీ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ హింస చెలరేగింది. ప్రస్తుతం తమకు, ఇతర గిరిజన వర్గాలకు కేటాయించిన భూమిని ఆక్రమించుకునేందుకు కూడా మైతీకి అనుమతి ఇవ్వవచ్చనే భయం కూడా కుకీలలో చాలా కాలంగా ఉంది. హింస నేపథ్యంలో వేలాది మంది సైనికులను కేంద్రం రంగంలోకి దించింది. కర్ఫ్యూ విధించారు.

Next Story

Most Viewed