మా మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటు కాదు: ఆప్ చీఫ్ కేజ్రీవాల్

by karthikeya |
మా మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటు కాదు: ఆప్ చీఫ్ కేజ్రీవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana)లో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) రసవత్తరంగా మారుతున్నాయి. అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతుంటే.. మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూరి పంజాబ్ తరహా సంచలనం సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు (శుక్రవారం) హర్యానాలో ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి జగధ్రిలో పార్టీ అభ్యర్ధి ఆదర్శ్‌పాల్‌ గుజ్జర్‌ (Adarshpal Gujjar)కు మద్దతుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

హర్యానా అసెంబ్లీలోని మొత్తం 90 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఆప్‌ నిర్ణాయక సీట్లను కైవసం చేసుకుంటుందని, ఈ సారి ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admy Party) మద్దతు తప్పనిసరి అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రజలకు అందించడం మినహా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ సారి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే హర్యానాలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ముందుగా అనుకున్నాయి. కానీ సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పొత్తు ఆలోచనలను పక్కన పెట్టి వేరువేరుగా పోటీ చేస్తున్నాయి.

Next Story

Most Viewed