All Party Meet : ఏపీ, బిహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదాపై గళం.. వాడివేడిగా అఖిలపక్ష భేటీ

by Hajipasha |
All Party Meet : ఏపీ, బిహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదాపై గళం.. వాడివేడిగా అఖిలపక్ష భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం ఉదయం పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు గళమెత్తాయి. ఈసందర్భంగా వివిధ డిమాండ్లను లేవనెత్తాయి. ప్రధానంగా బిహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని అధికార ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలు జేడీయూ, ఎల్‌జేపీ (రాం విలాస్) డిమాండ్ చేశాయి. ఎల్‌జేపీ (రాం విలాస్) తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ స్వయంగా ఈమేరకు తన డిమాండ్‌ను చదివి వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ కోరింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, కే సురేష్.. బీజేపీ నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘పరిస్థితులు మారాయి.. విచిత్రమేమిటి అంటే అఖిలపక్ష సమావేశంలో ఎన్డీయే మిత్రపక్ష పార్టీలు జేడీయూ, ఎల్‌జేపీ బిహార్‌కు ప్రత్యేక హోదాను కోరాయి. కానీ అదే ఎన్డీయే కూటమిలోని టీడీపీకి చెందిన ఫ్లోర్ లీడర్ ఏపీకి ప్రత్యేక హోదాను కోరలేక మౌనంగా ఉండిపోయారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వైఎస్సార్ సీపీ మాత్రమే కోరింది’’ అని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ‘‘బీజేడీ నేత సస్మిత్ పాత్రా ఒడిశాకు ప్రత్యేక హోదాను కోరారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దీనిపై ఒడిశా ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీని సస్మిత్ పాత్రా చక్కగా గుర్తు చేశారు’’ అని జైరాం రమేశ్‌ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకునే యత్నాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకే ఇవ్వాలి: గౌరవ్ గొగోయ్

విపక్షాలకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించాలని, దాన్ని ఖాళీగా ఉంచొద్దని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కోరారు. నీట్, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రధాన విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు లేవనెత్తారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చించాలని కోరారు. కన్వర్ యాత్ర జరిగే మార్గంలో ఫుడ్ షాపుల యజమానులు తప్పకుండా నేమ్‌ప్లేట్లు ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఈసందర్భంగా ప్రస్తావించారు. అలాంటి నిర్ణయాలు సరికావని ఖండించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కన్వర్ యాత్ర అంశాన్నే లేవనెత్తింది.

మణిపూర్‌, కాశ్మీర్‌ పరిస్థితులపై చర్చ జరగాల్సిందే: వామపక్షాలు

నీట్ పరీక్షలో అవకతవకల వ్యవహారంపై పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తి తీరుతామని సీపీఐ ఎంపీ పీ సంతోష్ కుమార్‌ తెలిపారు. ‘‘మణిపూర్‌ హింసాకాండ, జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, యూపీలో మతపరంగా ప్రజలను విభజించేలా పాలన, జాతీయ స్థాయి పరీక్షల్లో అవకతవకలు, ఉపాధి హామీ పథకం వంటి అంశాలపై చర్చ అవసరం’’ అని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు.‘‘పార్లమెంటులో సక్రమంగా చర్చలు జరగాలి. కానీ గత పదేళ్లుగా అవి జరగడం లేదు. రాష్ట్రాలపై అధికారంపై దాడి జరుగుతోంది’’ అని ఆయన ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, చైనాతో భద్రతాంశాలు, పార్లమెంటులో విగ్రహాల తొలగింపు, రైలు ప్రమాదాలు- ప్రయాణికుల భద్రతతో ముడిపడిన అంశాలను కూడా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో పలు విపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని సీఎం స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా చెన్నయ్ మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం ఎలాంటి ఫండ్స్ అందించలేదన్నారు. ఆదివారం (జులై 21న) బెంగాల్‌లో ‘షహీదీ దివస్‌’ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నందున అధికార టీఎంసీ పార్టీ తరఫు నేతలెవరూ అఖిలపక్ష భేటీకి హాజరుకాలేదు. సమావేశంలో టీడీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్సార్ సీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, మజ్లిస్‌ పార్టీ నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాందాస్ అథవాలే, అర్జున్ రామ్ మేఘవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్, జేడీయూ నేత సంజయ్ ఝా పాల్గొన్నారు.

ఆగస్టు 12 వరకు సెషన్

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. సోమవారం రోజే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. మంగళవారం రోజు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను ఆమోదం కోసం పార్లమెంటు ముందుకు తీసుకురానుంది.



Next Story