మోడీ ప్రకటనలన్నీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయి: సీపీఎం నేత సీతారాం ఏచూరి

by samatah |
మోడీ ప్రకటనలన్నీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయి: సీపీఎం నేత సీతారాం ఏచూరి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేస్తున్న ప్రకటనలన్నీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గురువారం ఆయన కేరళలో మీడియాతో మాట్లాడారు. మోడీ, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం మోడీ చేస్తున్న చర్యలపై మౌనంగా ఉందని కాంగ్రెస్, యూడీఎఫ్‌లు ఆరోపించడం సరికాదన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అరెస్టైన తొలి రాజకీయ నేతలలో తానూ ఒకరినని గుర్తు చేశారు.ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్‌లో రాజకీయ నాయకులను నిర్బంధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది కూడా వామపక్ష పార్టీయేనని స్పష్టం చేశారు.

ఎలక్టోరల్ బాండ్లను కూడా సీపీఎం వ్యతిరేకించిందని నొక్కి చెప్పారు. కాంగ్రెస్, యూడీఎఫ్‌ల ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు. దేశానికి వ్యతిరేకంగా కాషాయ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎండగట్టడంలో సీపీఎం ముందుందని చెప్పారు. బీజేపీని వ్యతిరేకించడం లేదని సీపీఎంపై ఆరోపణలు చేసేవారు ఈ విషయాన్నీ తెలుసుకోవాలని హితవు పలికారు. సీపీఎం వటకర అభ్యర్థి కేకే శైలజపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏచూరి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శైలజపై సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed