'నాకు సీఎం అవ్వాలనుంది'.. శరద్ పవార్‌ను ఉద్దేశించి అజిత్‌ పవార్‌ కామెంట్స్

by Vinod kumar |
నాకు సీఎం అవ్వాలనుంది.. శరద్ పవార్‌ను ఉద్దేశించి అజిత్‌ పవార్‌ కామెంట్స్
X

ముంబై : ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఏదో ఒకరోజు మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవ్వాలన్నదే తన కోరికని.. అది నెరవేర్చుకొని తీరుతానన్నారు. ఎన్సీపీ రెబల్‌ ఎమ్మెల్యేలతో బుధవారం ముంబైలో నిర్వహించిన మీటింగ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఈ కామెంట్స్ చేశారు. "బాబాయ్‌.. మీ వయసు ఇప్పుడు 83 ఏళ్లు.. ఇక రిటైర్‌ అవ్వరా..? మాకు మీ ఆశీస్సులు ఇవ్వరా .." అని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై మేనల్లుడు అజిత్‌ పవార్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "ఒక ఐఏఎస్‌ అధికారి 60 ఏళ్లకు రిటైర్‌ అవుతాడు. ఇతర పార్టీల్లో నేతలకు రిటైర్‌మెంట్‌ వయసు ఉంది. బీజేపీనే అందుకు ఉదాహరణగా తీసుకోండి. 75 ఏళ్లు రాగానే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి లాంటి వాళ్లు పక్కకు తప్పుకున్నారు.

అప్పుడే కదా కొత్త తరానికి అవకాశం దొరికేది. మరి ఎన్సీపీలో కొత్తవాళ్లకు అవకాశం ఉండదా?" అని ఆయన ప్రశ్నించారు. గత నెలలో ఎన్సీపీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే రాజీనామాను వెనక్కి తీసుకొని శరద్‌ పవార్‌ డ్రామాలు ఆడారని అజిత్‌ పవార్‌ సెటైర్లు వేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశమే ఉంటే శరద్‌ పవార్‌ రాజీనామా చేయడం ఎందుకని పేర్కొన్నారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకు ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పడంపై అజిత్‌ పవార్‌ స్పందిస్తూ.. "పవర్‌ఫుల్‌ ఫ్యామిలీలో పుట్టకపోవడం మా తప్పా?" అని వ్యాఖ్యానించారు. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో 40 మందితో పాటు ఐదుగురు ఎమ్మెల్సీల మద్దతు కూడా తనకు ఉందని వెల్లడించారు.

ఆగస్టు 11 తర్వాత ముఖ్యమంత్రిగా అజిత్ పవార్..?

ఆగస్టు 11న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ కు పట్టాభిషేకం చేయనున్నారని పేర్కొంటూ రెడిఫ్ మీడియా సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. ఆగస్టు 11 తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా మొత్తం 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ అనర్హత వేటు వేయడంతో పాటు సీఎం పదవికి రాజీనామా చేయాలని షిండేను కోరతారని కథనంలో పేర్కొంది. ఈ ఫార్ములా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశీస్సులతో ఢిల్లీలో రూపుదిద్దుకుందని తెలిపింది. 2022 జూన్ 20న ఉద్ధవ్ థాక్రేపై ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడానికి ముందు నుంచే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లతో అజిత్ పవార్ టచ్ లో ఉన్నాడని చెప్పింది. అయితే తనను ముఖ్యమంత్రిని చేయాలన్న పవార్ డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడం వల్ల చివరి నిమిషంలో ఆ ప్లాన్ అమలు ఆగిపోయిందని కథనంలో వివరించారు.

Advertisement

Next Story

Most Viewed