కేజ్రీవాల్‌ అరెస్టుపై యూఎన్ ఏం చెప్పిందో తెలుసా ?

by Hajipasha |
కేజ్రీవాల్‌ అరెస్టుపై యూఎన్ ఏం చెప్పిందో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించగా.. తాజాగా ఆ లిస్టులో ఐక్యరాజ్య సమితి కూడా చేరిపోయింది. ఎన్నికలు సమీపించిన వేళ భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ కూడా రియాక్టయ్యారు. ‘‘ఎన్నికల వేళ భారత్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఈ పరిణామాలపై ఏమంటారు ?’’ అని ఓ విలేకరి స్టీఫెన్‌ డుజారిక్‌‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘భారత్‌ సహా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లోనూ ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ లభిస్తుందని భావిస్తున్నాం. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం సరికాదు’’ అని ఇటీవల ఆందోళన వ్యక్తం చేసినందుకు అమెరికాకు భారత ప్రభుత్వం బలంగా కౌంటర్ ఇచ్చింది. ఇది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, తమ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని హితవు పలికింది. భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఇక్కడి చట్టాల ప్రకారం స్వేచ్ఛగా పని చేస్తుంటాయని అమెరికాకు మోదీ సర్కారు వివరణ ఇచ్చింది. ఆ వెంటనే అమెరికా దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఏకంగా ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్‌ వ్యవహారాలపై స్పందించడం గమనార్హం.

Advertisement

Next Story