- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NCP crisis : శరద్ పవార్ ఎన్‌సీపీ రెండు ముక్కలు..?
కొన్ని నెలల క్రితం శివసేన రెండు ముక్కలయింది..
ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది..
ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను చూస్తే అదే జరుగుతుందేమోనని అనిపిస్తోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ మేనల్లుడు, సీనియర్ నేత అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి అకస్మాత్తుగా తిరుగుబాటు చేశారు. ఆ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం రాజ్ భవన్‌కు వెళ్లి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు వార్తలు కలకలం రేపాయి. డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారనే న్యూస్ సెన్సేషన్ సృష్టించింది.
సరిగ్గా ఏడాది క్రితం ఇలాంటి సీన్ నే మహారాష్ట్ర చూసింది. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేశారు.. ఇది జరిగిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏక్ నాథ్ షిండే స్టైల్ లోనే శరద్ పవార్ పై అజిత్ పవార్ తిరగబడ్డారు.
అజిత్ పవార్ బలగం ఇదీ..
మహారాష్ట్రలో ఎన్‌సీపీకి మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 30 మంది అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ కూటమిలోకి జంప్ అయ్యారు. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను తప్పించుకోవాలంటే.. అజిత్ పవార్‌కు 36 మందికి పైగా ఎన్‌సీపీ ఎమ్మెల్యేల (మూడింట రెండు వంతుల మంది) మద్దతు అవసరం. త్వరలో మరో 10 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా అజిత్ పవార్ వెనుక వెళ్లే ఛాన్స్ ఉందని ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అదే జరిగితే మూడింట రెండు వంతుల మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లభించిన నేతగా ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు అజిత్ పవార్ తిరుగుబాటుకు(NCP vs NCP) వర్తించవు. అంతేకాదు ఈ తిరుగుబాటు దెబ్బకు ఎన్సీపీ చీలిపోయే అవకాశం ఉంది. శరద్ పవార్ పార్టీ చీఫ్ పదవికి కొన్ని రోజులు రాజీనామా చేసిన ఒక నెల తర్వాత ఈ సంక్షోభం చోటుచేసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర కేబినెట్‌లో ఇప్పుడు బీజేపీ నుంచి 9 మంది మంత్రులు, శివసేన నుంచి 9 మంది, ఎన్సీపీ నుంచి 9 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కేబినెట్‌లో గరిష్టంగా 43 మంది సభ్యులు ఉండొచ్చు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది..?
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. శాసనసభ్యులు తమ రాజకీయ పార్టీల నుంచి ఫిరాయించకుండా నిరోధించడానికి ఈ షెడ్యూల్ ను 1985లో ప్రవేశపెట్టారు. తమ పార్టీని స్వచ్ఛందంగా వదిలివేయడం లేదా పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా పార్టీ ఫిరాయించిన పార్లమెంటేరియన్లు లేదా శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ఈ షెడ్యూల్ వివరిస్తుంది.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఎప్పుడు వర్తించదు..?
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక శాసనసభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. ఏదైనా సమస్యపై పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా వారి స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ చట్టం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం రెండు మినహాయింపులను అందిస్తుంది. అవేమిటంటే.. కొంతమంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఒక సమూహంగా ఏర్పడితే ఈ పరిణామాలను ఎదుర్కోకుండానే ఓటింగ్‌కు గైర్హాజరు కావచ్చు. ఒక రాజకీయ పార్టీకి చెందిన శాసనసభ్యులలో మూడింట ఒక వంతు మంది దాని నుంచి రాజీనామా చేస్తే లేదా మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు మరొక పార్టీలో విలీనమైతే దాన్ని ఫిరాయింపుగా పరిగణించరు.
శరద్ పవార్‌కు ముందే సమాచారం ఉందా..?
భవిష్యత్‌లో జరగబోయే పరిణామాల గురించి.. అజిత్ పవార్ తిరుగుబాటు గురించి కొంత ముందస్తు సమాచారం ఉండటం వల్లే అప్పట్లో శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారనే టాక్ నడిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతోనూ శరద్ పవార్ భేటీ అయ్యారు. అయితే ఆ భేటీలో ఏవిధమైన అంశాలపై చర్చ జరిగింది? అనేది నాడు బయటికి రాలేదు. ఆ తర్వాత పార్టీలోని రెండు కీలక పదవులను కూతురు సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ లకు శరద్ పవార్ అప్పగించారు. భవిష్యత్‌లో అజిత్ పవార్ నుంచి పొంచి ఉన్న ముప్పును అంచనా వేయబట్టే ఆయనకు ఏ పదవిని కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.