మరోసారి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ

by Dishanational6 |
మరోసారి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ మేనిఫెస్టోపై మరోసారి విమర్శలు గుప్పించింది బీజేపీ. బీసీలు, పేదల హక్కులు లాక్కొని.. రాజకీయాల కోసం వాటిని ముస్లింలకు ఇవ్వడమే కాంగ్రెస్ రహస్య ఎజెండా అన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కొని ముస్లింలకు ఇవ్వడమే కాంగ్రెస్, ఇండియా కూటమి రహస్య ఎజెండా అని విమర్శించారు. దేశంలోని వనరులపై తొలి హక్కు ముస్లింలదేనని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. కానీ, దేశ వనరులపై తొలి హక్కు పేదలదని మోడీ అంటున్నారని అన్నారు.

గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటనను మరోసారి ప్రస్తావించారు జేపీ నడ్డా. పొరపాటున ఆ ప్రకటన చేయలేదని గుర్తు చేశఆరు. ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వాన్నమైన పరిస్థితుల్లో ముస్లింలను చూపించేందుకు కాంగ్రెస్ హయాంలోని సచార్ కమిటీ నివేదిక తప్పుడు ప్రకటన చేసిందని పేర్కొన్నారు.

సచార్ కమిటీ నివేదిక ద్వారా దళితుల కంటే ముస్లింలు అధ్వాన్నంగా ఉన్నారని తప్పుడు ప్రకటనలు చేశారని మండిపడ్డారు. ముస్లింలను ఎస్సీలుగా ప్రకటించి వారికి ఎస్సీ రిజర్వేషన్ల సౌకర్యాలు కల్పించాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని ఫైర్ అయ్యారు.

ఇటీవలే, ప్రతిపక్షాలు సంపదను ముస్లింలకు దోచిపెట్టాలని చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. మోడీ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎంఎల్), ప్రజా సంఘాలు దాఖలు చేసిన ఫిర్యాదులపై సోమవారంలోగా సమాధానమివ్వాలని బీజేపీ చీఫ్ ను ఆదేశించింది ఈసీ.

13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో రెండోదశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగతుండగా.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.



Next Story

Most Viewed