కాంగ్రెస్ తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీకి రూ. 11 కోట్ల పన్ను నోటీసులు

by S Gopi |
కాంగ్రెస్ తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీకి రూ. 11 కోట్ల పన్ను నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను శాఖ వరుసగా షాకులిస్తోంది. శుక్రవారం కాంగ్రెస్‌కు రూ. 1,800 కోట్లకు పైగా పన్ను నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ, కమ్యూనిస్ట్ పార్టీ సైతం ఇదే తరహా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పాత పాన్ కార్డును ఉపయోగించి పన్ను రిటర్నులు దాఖలు చేసిన కారణంగా రూ. 11 కోట్ల బకాయిలను చెల్లించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ)కి ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో పన్నుల అధికారులను సవాలు చేస్తూ లెఫ్ట్ పార్టీ తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఐటీ విభాగానికి చెల్లించాల్సిన ఈ బకాయిలు జరిమానా, వడ్డీతో కలిపి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌కు సైతం ఐటీ శాఖ పన్ను రిటర్నులకు సంబంధించి రూ. 1,823 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని నోటీసులు అందజేసింది. మరోవైపు గడిచిన 72 గంటల్లో తనకు 11 ఐటీ నోటీసులు వచ్చాయని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే అన్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed