అదానీ డిఫెన్స్ రికార్డ్.. దక్షిణాసియాలోనే పెద్ద ఆయుధ కాంప్లెక్స్‌ రెడీ

by Hajipasha |
అదానీ డిఫెన్స్ రికార్డ్.. దక్షిణాసియాలోనే పెద్ద ఆయుధ కాంప్లెక్స్‌ రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత రక్షణ రంగానికి దన్నుగా నిలిచే దిశగా ‘అదానీ డిఫెన్స్’ మరో ముందడుగు వేసింది. అదానీ డిఫెన్స్‌కు చెందిన దక్షిణాసియాలోనే అతిపెద్దదైన మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభమైంది. దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజా సుబ్రమణి, మాస్టర్ జనరల్ ఆఫ్ సస్టెనెన్స్ అమర్‌దీప్ సింగ్ ఔజ్లా ప్రారంభించారు. రక్షణ శాఖ, యూపీ ప్రభుత్వ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. 2019 ఫిబ్రవరి 26న ‘ఆపరేషన్ బందర్’ పేరుతో పాకిస్తాన్‌లోని బాలాకోట్ ప్రాంతంపై వైమానిక దాడిని భారత ఆర్మీ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌‌ను నిర్వహించిన ఐదో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రోజు మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సుకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సదుపాయంలో పెద్దఎత్తున మందుగుండు సామగ్రి, బుల్లెట్లు, క్షిపణులను తయారు చేయనున్నారు. కాన్పూర్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్‌కు భూమిని కేటాయించిన 18 నెలల్లోనే కార్యకలాపాలను మొదలుపెట్టడం అనేది ముఖ్యమైన అంశమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘‘రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సు ప్రాజెక్టును చేపట్టాం. దీనివల్ల 4,000 ఉద్యోగాలు ఏర్పడతాయి’’ అని అదానీ డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ వెల్లడించారు.

Advertisement

Next Story