Mamata Banerjee :బెంగాల్‌ను విభజించే ప్రయత్నాలను ప్రతిఘటిస్తాం : మమతా బెనర్జీ

by Hajipasha |   ( Updated:2024-07-29 18:19:01.0  )
Mamata Banerjee :బెంగాల్‌ను విభజించే ప్రయత్నాలను ప్రతిఘటిస్తాం : మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను ప్రతిఘటించి తీరుతామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించేందుకు ఎవరైనా యత్నిస్తే.. మేం ఎలా అడ్డుకుంటామో వారంతా తప్పకుండా చూస్తారని ఆమె తేల్చి చెప్పారు. సోమవారం బెంగాల్ అసెంబ్లీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను విభజించే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని ఆమె మండిపడ్డారు. ‘‘బంగ్లాదేశ్ అంటే మాకు ప్రేమే. కానీ తీస్తా నదీ జలాలను ఆ దేశంతో పంచుకునే ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. బంగ్లాదేశ్‌కు తీస్తా నది నీళ్లిస్తే.. బెంగాల్‌‌లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఇక సోమవారం రోజు పార్లమెంటు ఆవరణలో మీడియా ప్రతినిధుల కవరేజీ సంబంధిత కార్యకలాపాలపై నిషేధం విధించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది నిరంకుశ ప్రభుత్వపు నిరంకుశ చర్య. దీనికి వ్యతిరేకంగా విపక్షాలన్నీఏకతాటిపై నిలబడాలి’’ అని కోరారు. పార్లమెంటు ఆవరణలోని నిర్దేశిత ప్రదేశం నుంచి మాత్రమే మీడియా కవరేజీ చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు నిర్దేశించింది. ఈనేపథ్యంలో సోమవారం రోజు వారికి కేటాయించిన ప్రదేశం నుంచి విధులు నిర్వర్తిస్తున్న పాత్రికేయులను రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, శివసేన-యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు.

Advertisement

Next Story