సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కేసులో నిందితుడి ఆత్మహత్య

by S Gopi |
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కేసులో నిందితుడి ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. కొంతమంది నిదితులను సైతం అరెస్ట్ చేశారు. అయితే, బుధవారం కస్టడీలో ఉన్న అనూజ్ తపన్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు లాకప్‌లో ఉన్న అతను బుధవారం ఉదయం బాత్రూమ్‌లో దుప్పటితో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన అధికారులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్టు పోలీసులు స్పష్టం చేశారు. అనూజ్ తపన్‌ను పోలీసులు ఏప్రిల్ 26న అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 14న నటుడు సల్మాన్ ఖాన్ ఇంటికి దగ్గరలో కాల్పులు జరిగాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగుసార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఘటన తర్వాత వారు బైకుపై వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ రికార్డుల ఆధారంగా నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌ను అరెస్ట్ చేశారు. అలాగే, వారికి ఆయుధాలు ఇచ్చిన ఆరోపణలతో అనూజ్ తపన్, సోను సుభాష్ చందర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అనూజ్ తపన్‌ను ఆత్మహత్యకు పురికొల్పిన కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed