Kejriwal: సొంత బలంతోనే పోటీ చేస్తాం.. పొత్తులపై కేజ్రీవాల్ కీలక ప్రకటన

by Shamantha N |
Kejriwal: సొంత బలంతోనే పోటీ చేస్తాం.. పొత్తులపై కేజ్రీవాల్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Polls) జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party (AAP)) బాస్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీ (AAP) సొంత బలంతోనే పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు’’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్‌, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరిదశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలని కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఆప్‌-కాంగ్రెస్‌ (AAP-Congress)ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని, కాంగ్రెస్‌కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. 1-2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించనున్నట్లు పేర్కొనగా, అవన్నీ ట్రాష్ అని కేజ్రీవాల్ తోసిపుచ్చారు.

పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు..

ఇక, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సమయంలో ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. కానీ బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యింది. మొత్తం ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఇరు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. సీట్ల ఎంపికపై పొత్తు చర్చలు విఫలమవడంతో అక్టోబర్‌లో జరిగిన హర్యానా ఎన్నికల్లో రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. దానివల్లే, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు తన అభ్యర్థులతో కూడిన రెండు జాబితాలను ఆప్‌ విడుదల చేసింది. రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవైపు, కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీలోని ఆటో డ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు. రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా, కుమార్తె పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయం సహా పలు హామీలు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed