Rajasthan: రైల్వే ఉద్యోగి చేతిని కొరికిన పులి

by Harish |
Rajasthan: రైల్వే ఉద్యోగి చేతిని కొరికిన పులి
X

దిశ, నేషనల్ బ్యూరో: గతంలో రాజస్థాన్‌ అల్వార్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఒక పులి పరిసర ప్రాంతాల్లోని ప్రజలపై దాడులు చేస్తూ, అక్కడి వారిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆ పులి పేరు ఎస్టీ 2303, తాజాగా అది ఖైర్తాల్-తిజారా జిల్లాలో రైల్వే ఉద్యోగి చేతిని కొరికి, ఆ తరువాత ఒక గ్రామంలోకి చొరబడి మరో నలుగురిపై దాడి చేసింది. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బస్ని గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి వికాస్ కుమార్ అజార్కా (ఖైర్తాల్-తిజారా) రైల్వే స్టేషన్‌‌లో తన సోదరుడి కోసం ఎదురు చూస్తుండగా పులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి చేతిని కొరికింది. అటు వైపు బైక్ రావడం చూసిన పులి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. ఈ దాడిలో కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.

అతనిపై దాడి చేసిన తరువాత ఆ పులి దర్బార్‌పూర్ గ్రామం వైపు వెళ్లింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సతీష్ (45), బిను (30), మహేంద్ర (33) అనే ముగ్గురు వ్యక్తులతో పాటు, మరో యువకుడిపై దాడి చేసింది. ఈ ఘటనలో వారు గాయపడగా అల్వార్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పులి కారణంగా గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని దర్బార్‌పూర్ సర్పంచ్ తెలిపారు. గతంలో కూడా ఈ పులి రాజస్థాన్-హర్యానా సరిహద్దుకు సమీపంలోని ఓ గ్రామంలో కొందరు అటవీ సిబ్బందిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు గ్రామస్తులకు సూచిస్తున్నారు.

Advertisement

Next Story