100 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు.. కిటికీలో నుంచి పడిపోయిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే..

by Rani Yarlagadda |
100 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు.. కిటికీలో నుంచి పడిపోయిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే..
X

దిశ, వెబ్ డెస్క్: 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి పడిపోయిన ఏ వ్యక్తి అయినా బతికి బట్టకడతాడా అంటే.. అందరూ లేదనే అంటారు. కానీ.. ఆ విషయంలో ఈ చిన్నారి అదృష్టవంతురాలు. ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయనుకుంటా. అంత వేగంగా వెళ్తున్న రైలు కిటికీలో నుంచి పడినా.. దెబ్బలతో తప్పించుకుంది. ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో గతవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలిక కదులుతున్న రైలు ఎమర్జెన్సీ కిటికీలో నుంచి పడిపోయింది. రైలు 16 కిలోమీటర్ల వరకూ ముందుకు వెళ్లాక.. తండ్రి తన కూతురు కనిపించడం లేదన్న విషయాన్ని గమనించాడు. వెంటనే రైల్వే అధికారులకు విషయం చెప్పడంతో.. రైలును ఆపి రైల్వే పోలీసుల్ని రంగంలోకి దింపారు.

మథుర జిల్లాలోని వ్రధావన్ కు చెందిన అరవింద్ తివారీ తన భార్య, 8 ఏళ్ల కుమార్తెతో కలిసి మధ్యప్రదేశ్ లో తన స్వగ్రామమైన తికమ్ ఘర్ కు బయల్దేరారు. రైలులో కూతురు ఎమర్జెన్సీ కిటికీ (train emergency window) పక్కన కూర్చుని ఉండగా.. రైలు మలుపు తిరగడంతో ఆమె కిటికీలోనుంచి పడిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ పొదలు ఉండటంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. రైల్వే పోలీసులు (railway police) 16 కిలోమీటర్లు కాలినడకన బాలికను వెతుక్కుంటూ వెళ్లగా.. కాలికి గాయంతో కనిపించింది. వెంటనే గూడ్స్ రైలు ద్వారా బాలికను స్టేషన్ కు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడి నుంచి డిశ్చార్జి అయి ఆదివారం సాయంత్రం బాలిక ఇంటికి చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed