Collector : ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి

by Kalyani |   ( Updated:2024-10-15 13:08:22.0  )
Collector : ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి
X

దిశ, మెదక్ ప్రతినిధి : ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ లో ధరణి దరఖాస్తులు పై మంగళవారం సంబంధిత తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల పై మండలాల వారీగా తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల ఆన్ లైన్ లో అప్డేట్ చేసి పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో పెండెన్సీ లో 3000 ధరణి దరఖాస్తులు ఉన్నాయన్నారు.

30 జూన్ వరకు ఏవైతే పెండింగ్ ధరణి దరఖాస్తులు ఉన్నాయో వాటిని వెంటనే త్వరితగతిన కలెక్టరేట్ సూపర్డెంట్ తో సమన్వయం చేసుకొని ముగించాలన్నారు. ఈ దరఖాస్తులకు ముగింపుకు వారం గడువు తేదీ ఇస్తున్నట్టు తెలిపారు. జెన్యూన్ పట్టాదారు విషయంలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇనాం కేసు విషయంలో తాగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డేటా కరెక్షన్ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించాలని అన్నారు. మ్యుటేషన్ వంటి దరఖాస్తులను రికార్డులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, గ్రామ స్థాయిలో పెరిగిన రీ సెటిల్మెంట్ రికార్డ్(ఆర్ ఎస్ ఆర్) విషయంలో కాస్రా సంబంధిత బేస్ రికార్డ్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.

ధరణి దరఖాస్తులను తిరస్కరించిన పక్షంలో అందుకు స్పష్టమైన కారణాలు, సంబంధిత ఆధారిత డాక్యుమెంట్లు స్పష్టంగా అప్ లోడ్ చేయాలని, అలా చేయడం వల్ల ప్రజలకు ఎందుకు దరఖాస్తు తిరస్కరించారనేది అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సమస్యలు తహసీల్దార్ స్థాయిలో, మరికొన్ని సమస్యలు రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయి లో, మరికొన్ని సమస్యలు కలెక్టర్ స్థాయిలో ఉన్న దరఖాస్తులపై పక్కా ప్రణాళికతో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story