Bihar Stampede: వాలంటీర్లు లాఠీఛార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట

by Shamantha N |
Bihar Stampede:  వాలంటీర్లు లాఠీఛార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ జెహనాబాద్ జిల్లాలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మరణించారు. అయితే, అడ్మినిస్ట్రేషన్ ఏర్పాట్లు లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో నిమగ్నమైన కొంతమంది నేషనల్ క్యాడెట్ కార్ప్స్(NCC) వాలంటీర్లు భక్తులపై లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. దీంతో తొక్కిసలాట జరిగిందని బాధితులు మీడియాకు తెలిపారు. పూలు విక్రయించే వ్యక్తితో ఘర్షణ చెలరేగిందని.. దీంతో వాలంటీర్లు లాఠీఛార్జ్ చేశారని మరో భక్తుడు తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించాడు. బరావర్ కొండలపై ఉన్న బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు చనిపోయారు. దాదాపు 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారు స్థానిక మఖ్దుంపూర్, సదర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఆరోపణలను ఖండించిన అధికారులు

జెహనాబాద్ ఎస్డీఓ వికాష్ కుమార్ భక్తులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వాలంటీర్లు లాఠీఛార్జ్ చేయలేదని స్పష్ట చేశారు. " ఇది దురదృష్టకర ఘటన. కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఎన్ సీసీ, సివిల్ డిప్యూటేషన్‌లు, మెడికల్ టీమ్‌లతో సహా తగిన ఏర్పాట్లు అన్నీ చేశాం. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు చెప్పగలం" అని అన్నారు. జెహనాబాద్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అలంకృత పాండే మాట్లాడుతూ.. కన్వారియాల మధ్య జరిగిన వివాదం వల్లే తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఏటా శ్రావణ మాసంలో జరిగే పవిత్రోత్సవాల కోసం బాబాసిద్ధేశ్వర్ నాథ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది.

Advertisement

Next Story

Most Viewed