హిమాచల్‌ప్రదేశ్‌లో 650 రోడ్లు మూసివేత: పర్యాటకులకు హెచ్చరికలు జారీచేసిన పోలీసులు

by samatah |
హిమాచల్‌ప్రదేశ్‌లో 650 రోడ్లు మూసివేత: పర్యాటకులకు హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా భారీ హిమపాతం సంభవిస్తున్న విషయం తెలిసిందే. వర్షం, మంచు విపరీతంగా కురుస్తుండటంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని ఐదు జాతీయ రహదారులతో సహా సుమారు 650 రోడ్లను మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేగాక మొబైల్ నెట్‌వర్క్ కు సైతం ఆటంకం కలిగింది. లాహౌర్, స్పితి గిరిజన జిల్లాల్లో 290 రోడ్లు బ్లాక్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ జిల్లాల్లో విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

81 మంది పర్యాటకుల తరలింపు

ఆయా జిల్లాల్లో రోడ్లు బ్లాక్ అవడంతో అందులో చిక్కుకు పోయిన81 మంది పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు. జోబ్రాంగ్, రాపి, జస్రత్, తరండ్, థారోట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులు సైతం రోడ్లను సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నాకే ప్రయాణాలు చేయాలని సూచించారు. అయితే హిమపాతం ఘటనల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. లాహౌల్, స్పితిలోని జస్రత్ గ్రామ సమీపంలోని దారా జలపాతం వద్ద హిమపాతం కారణంగా చీనాబ్ నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ జిల్లాలో గత 24 గంటల నుంచి భారీగా మంచు కురుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed