యూపీ, బీహార్‌లలో భానుడి భగభగ.. ఒక్కరోజే 53 మంది మృతి

by Vinod kumar |
యూపీ, బీహార్‌లలో భానుడి భగభగ.. ఒక్కరోజే 53 మంది మృతి
X

పాట్నా: ఎండలు దడ పుట్టిస్తున్నాయి.. వడగాలులకు జనం విలవిలలాడుతున్నారు.. యూపీ, బీహార్ రాష్ట్రాలను భారీ టెంపరేచర్స్ వణికిస్తున్నాయి. గత 24 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో 53 మంది చనిపోయారు. 600 మంది ఆస్పత్రి పాలయ్యారు. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉత్తర ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో గత 3 రోజుల్లో 54 మంది చనిపోయారు. మరో 400 మంది ఆస్పత్రి పాలయ్యారు. గత మూడు రోజులుగా పెరుగుతూ పోతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్లే (Deadly Heat Wave) ఈ మరణాలు సంభవించాయని వైద్యులు తెలిపారు.

బలియా జిల్లాలో గత మూడు రోజులలో సగటున 42 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. చనిపోయిన వారిలో చాలామంది జ్వరం, రక్తపోటు, గుండెపోటు, శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారని వైద్యులు తెలిపారు. జూన్ 15న 20 మంది, జూన్ 16న 23 మంది, జూన్ 17న 11 మంది మరణించారని బలియా జిల్లా ఆస్పత్రి ఇన్‌ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్‌కె యాదవ్ వెల్లడించారు.

పాట్నాలోనే అత్యధికంగా..

బీహార్‌లోని 18 ప్రాంతాలు వడగాలులతో వణుకుతున్నాయి. వడగాలులకు గత 24 గంటల్లో అక్కడ 44 మంది చనిపోయారు. మృతుల్లో 35 మంది పాట్నా సిటీవాసులే కావడం గమనార్హం. నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (NMCH)లో 19 మంది, PMCH లో 16 మంది రోగులు మరణించారు. బీహార్‌లోని ఇతర జిల్లాల్లో తొమ్మిది మంది మరణించారు. దాదాపు 200 మంది ఆస్పత్రి పాలయ్యారు. బీహార్‌లోని 11 జిల్లాల్లో గత రెండు రోజులుగా సగటున 44 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. షేక్‌పురాలో అత్యధికంగా 45.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పాట్నాలో స్కూల్స్ సెలవులను జూన్ 24 వరకు పొడిగించారు. వడగాలుల దృష్ట్యా మధ్యప్రదేశ్ లోని పాఠశాలలకు కూడా వేసవి సెలవులను జూన్ 30 వరకు పొడిగించారు.

Advertisement

Next Story

Most Viewed