ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు

by S Gopi |
ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో ఉన్న 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మంది (44 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనంలో తేలింది. అలాగే, వారిలో 5 శాతం బిలియనీర్లు ఉన్నారని, వీరి ఒక్కోక్కరి ఆస్తులు రూ. 100 కోట్ల కంటే ఎక్కువే ఉంటాయని ఏడీఆర్ తెలిపింది. సిట్టింగ్ ఎంపీల అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఏడీఆర్ నివేదిక ప్రకారం, క్రిమినల్ కేసులు ఉన్న వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేశాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్‌లు, మహిళలపై నేరాలకు పాల్పడిన తీవ్రమైన కేసులు ఉన్నాయి. 9 మందిపై హత్య కేసులు ఉండగా, వారిలో ఐదుగురు బీజేపీ వారే కావడం గమనార్హం. 28 మందిపై హత్యాయత్నం కేసులు ఉంటే, వారిలో 21 మంది బీజేపీకి చెందినవారు. మహిళలపై నేరాలకు పాల్పడిన కేసుల్లో 16 సిట్టింగ్ ఎంపీలు ఉండగా, ముగ్గురిపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి.

ఆర్థిక వివరాలకు సంబందించి.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల్లోనే ఎక్కువ మంది బిలీయనీర్లు ఉన్నారని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. అత్యధిక సంపద ఉన్న ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన నకుల్‌నాథ్ మొదటిస్థానంలో ఉండగా, తర్వాత కాంగెస్‌కే చెందిన డీకే సురేస్, కనుమూరు రఘురామ కృష్ణరాజు(ఇటీవలే ఏపీ వైసీపీకి రాజీనామా చేశారు) ఉన్నారు. అత్యధిక క్రిమినల్ కేసులున్న ఎంపీలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలవారే ఉన్నారు. వీరిలో 50 శాతం మందిపై కేసులున్నాయి. మొత్తం ఎంపీల్లో 73 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, 514 మందిలో 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉండటం ఆశ్చర్యం.

Advertisement

Next Story

Most Viewed