Jammu Kashmir: కశ్మీర్‌లోనూ కాంగ్రెస్‌కు దెబ్బ? నేషనల్ కాన్ఫరెన్స్‌కు సొంతంగా మెజార్టీ.. ఎలాగంటే?

by Mahesh Kanagandla |
Jammu Kashmir: కశ్మీర్‌లోనూ కాంగ్రెస్‌కు దెబ్బ? నేషనల్ కాన్ఫరెన్స్‌కు సొంతంగా మెజార్టీ.. ఎలాగంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పొత్తులో 6 సీట్లతో జూనియర్ పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌కు ఆ ప్రాధాన్యత కూడా తగ్గిపోనుంది. ఎందుకంటే నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ సొంతంగా మెజార్టీ సీట్ల మద్దతు పొందింది. దీంతో కాంగ్రెస్‌ సీట్లు లేకున్నా నేషనల్ కాన్ఫరెన్స్ పెద్దగా నష్టపోయేది లేదు.

ఇందర్వాల్, ఛాంబ్, సురన్‌కోట్, బాని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వంతంత్రంగా పోటీ చేసి గెలుపొందిన ప్యారేలాల్ శర్మ, సతీశ్ శర్మ, చౌదరి మహమ్మద్ అక్రమ్, డాక్టర్ రామేశ్వర్ సింగ్‌లు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బలం 46కు పెరిగింది. 90 సీట్లున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 46. స్వతంత్రుల మద్దతుతో నేషనల్ కాన్ఫరెన్స్‌ సొంతంగా ఈ బలాన్ని సంపాదించుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు ఇందులో లేరు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఉనికి సంక్షోభంలో పడుతున్నది.

తప్పకుండా గెలుస్తుందనుకున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. జమ్ము కశ్మీర్‌లోనూ అంతంత మాత్రంగానే ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ సొంతంగా మెజార్టీ సీట్లను కలిగి ఉన్నది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలుగా మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఇవి ప్రతికూల ప్రభావాన్ని వేసే ముప్పు ఉన్నది. ఇది కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతున్నది.

Advertisement

Next Story

Most Viewed