సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి పార్లమెంటు.. ఎందుకీ మార్పు ?

by Hajipasha |
సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి పార్లమెంటు.. ఎందుకీ మార్పు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంటు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్ఎఫ్) CISF) ఆధీనంలోకి వెళ్లనుంది. ఇక నుంచి భారత పార్లమెంటు కాంప్లెక్సుకు సీఐఎస్‌ఎఫ్‌ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన 3317 మందికిపైగా సిబ్బంది భద్రత కల్పించనున్నారు. సీఆర్పీఎఫ్‌ కమాండర్ శుక్రవారమే పార్లమెంటులోని అన్ని సెక్యూరిటీ పాయింట్‌లను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్‌, కమ్యూనికేషన్ సెంటర్‌, జాగిలాల స్క్వాడ్‌, వాచ్ టవర్ల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే వారికి సంబంధిత ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికి తాత్కాలిక పద్ధతిలోనే సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారని, కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనికి సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని తెలుస్తోంది.

ఇప్పటివరకు సీఆర్పీఎఫ్ పహారా..

ఇప్పటివరకు సీఆర్పీఎఫ్‌‌కు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌ (పీడీజీ), ఢిల్లీ పోలీసులు, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్‌ (పీఎస్ఎస్‌) పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా భద్రత బాధ్యతలను నిర్వర్తించాయి. పార్లమెంటుకు దాదాపు 1400 మందికిపైగా సిబ్బంది పహారా ఇచ్చేవారు. సీఐఎస్ఎఫ్ ఎంట్రీతో ఇప్పుడు భద్రతా సిబ్బంది సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరగనుంది. దాదాపు 1.70 లక్షల మంది సిబ్బందితో కూడిన ‘సీఐఎస్‌ఎఫ్‌’.. కేంద్ర హోంశాఖ ఆధీనంలోని కేంద్ర సాయుధ పోలీసు దళం. ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతో పాటు పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్‌ కేంద్రాలు, ఢిల్లీ మెట్రో వద్ద ఇది భద్రత కల్పిస్తోంది.

2023 డిసెంబరు 13 ఘటనతో..

అయితే గతేడాది డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్‌ జరుగుతుండగా.. ఇద్దరు దుండగులు విజిటర్స్‌ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్‌ క్యానిస్టర్లతో ఆందోళన చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ అలజడి పార్లమెంటు భద్రతపై అనేక సందేహాలు రేకెత్తించింది. దీంతో పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమగ్ర భద్రత బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Next Story