33శాతం మహిళా రిజర్వేషన్ ప్రియాంకకు సహాయం చేస్తుంది: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు

by samatah |
33శాతం మహిళా రిజర్వేషన్ ప్రియాంకకు సహాయం చేస్తుంది: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన 33శాతం మహిళా రిజర్వేషన్ ప్రియాంక ఎన్నికల ఆరంగేట్రానికి ఉపయోగపడుతుందని తెలిపారు. దీని వల్ల ఆమె ప్రయోజనం పొందవచ్చని చెప్పారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షాన్ని దేశం కోరుకుంటుందని, కాబట్టి కాంగ్రెస్ ఎంతో కష్టపడి పని చేయాలని సూచించారు. ఓటమికి భయపడే రాహుల్ అమేథీ నుంచి రాయ్ బరేలీకి పారిపోయారని విమర్శించారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా ఇద్దరూ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, వారికి కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాబట్టి మహిళా కోటా ప్రియాంకకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

‘మేము బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ప్రభుత్వాన్ని సరైన పద్దతిలో పెట్టడంలో సహాయపడుతుంది. మీడియా, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యానికి బలాలు. వారు ప్రశ్నించడం ద్వారానే ప్రభుత్వాన్ని లెక్కిస్తారు. కాబట్టి ఏ నాయకుడు వచ్చినా, మేము వారిని స్వాగతిస్తాం, సోనియా, రాహుల్, ప్రియాంక వారి ఇతర కుటుంబ సభ్యులు కూడా రావచ్చు. రాబర్ట్ వాద్రా కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ అతనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని తెలిపారు. కాగా, స్టార్ క్యాంపెయినర్ అయిన ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, వ్యూహంలో భాగంగానే రాహుల్ రాయ్‌బరేలీకి మారారని, భవిష్యత్తులో ఏదైనా ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక పార్లమెంటుకు రావచ్చని కాంగ్రెస్ పేర్కొంది.

Advertisement

Next Story