జేడీఎస్‌కు 3సీట్లు: కర్ణాటకలో సీట్ షేరింగ్ ఖరారు!

by samatah |
జేడీఎస్‌కు 3సీట్లు: కర్ణాటకలో సీట్ షేరింగ్ ఖరారు!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎన్డీయే కూటమి సీట్ షేరింగ్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కర్ణాటకలో జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్)కు మూడు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మాండ్యా, హసన్, కోలార్ స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే బెంగళూరు రూరల్ సెగ్మెంట్‌లో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్ బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 28లోక్ సభ స్థానాలకు గాను 20స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను గతంలో ప్రకటించింది. అయితే దీనిపై జేడీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. సీట్ షేరింగ్‌లో భాగంగా జేడీఎస్ కు 3సీట్లు కేటాయించకుంటే సొంతంగా అభ్యర్థులను బరిలోకి దించుతామని జేడీఎస్ నేత కుమారస్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకం జరిగినట్టు తెలుస్తోంది.

కాగా, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను బీజేపీ 25, కాంగ్రెస్ 1, జేడీఎస్1, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందాయి. అయితే గతేడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్‌కు దక్కిన మూడు స్థానాల్లో ప్రస్తుతం కోలార్‌లో బీజేపీ, హసన్‌లో జేడీఎస్‌, మాండ్యాలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే కోలార్ సీటుపై జేడీఎస్-బీజేపీల మధ్య ప్రతిష్టంభనకు దారితీసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో గెలుపొందినందున ఆ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకోవాలని భావించగా, జేడీఎస్ మాత్రం రెండు సీట్లతో సరిపెట్టుకోబోమని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed