18 గంటలు శ్రమించి బోర్‌వెల్‌లో పడిన రెండేళ్ల చిన్నారిని రక్షించిన అధికారులు

by S Gopi |
18 గంటలు శ్రమించి బోర్‌వెల్‌లో పడిన రెండేళ్ల చిన్నారిని రక్షించిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్నాటకలోని బీజాపూర్ జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడిని 18 గంటల పాటు ఆపరేషన్ చేసి అధికారులు రక్షించారు. లచాయన గ్రామానికి చెందిన సతీష్ ముజగొండ తన ఇంటికి సమీపంలో ఉన్న పొలంలో బోరుబావిని తవ్వించాడు. బుధవారం సాయంత్రం అతని రెండేళ్ల కుమారుడు సాత్విక్ పొలం దగ్గరే ఆడుకుంటూ ప్రమాదవశాతు బోరుబావిలో పడిపోయాడు. బాలుడు ఏడుపు విన్న స్థానికులు వెంటనే తల్లిదండ్రులతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు తక్షణం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి చర్యలు ప్రారంభించారు. బాలుడిని రక్షించేందుకు అధికారులు ఎక్స్‌కవేటర్‌తో బోర్‌వెల్‌కు సమాంతరంగా 21 అడుగుల లోతులో గొయ్యి తవ్వారు. 18 గంటల పాటు శ్రమించిన అనంతరం బాలుడిని బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి గురించి అధికారులు ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది. వైద్య బృందం అక్కడే ఆంబులెన్స్‌తో పాటు సిద్ధంగా ఉండటంతో అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed