ఒకే కుటుంబంలోని ఆరుగురిపై కాల్పులు జరిపిన యువకుడు

by Prasanna |   ( Updated:2023-11-20 07:54:04.0  )
ఒకే కుటుంబంలోని ఆరుగురిపై కాల్పులు జరిపిన యువకుడు
X

పాట్నా: బీహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. రాష్ట్రంలోని లఖిసరాయ్‌లో ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డరు. పోలీసుల వివరాల ప్రకారం, కబేయా పీఎస్ పరిధిలోని పంజాబీ మొహల్లా ప్రాంతంలో బాధిత కుటుంబం ఛఠ్ పూజలో భాగంగా సూర్యుడికి ఆర్ఘ్యం అర్పించి వస్తున్న సమయంలో పొరుగునే ఉండే యువకుడు వారిపై కాల్పులు జరిపాడు. బాధిత కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్న యువకుడికి, వారి నుంచి అనుమతి రాకపోవడమే కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో చందన్ ఝా, రాజ్‌నందన్ కుమార్ మరణించారు. గాయపడిన వారిలో యువకుడు పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయి లవ్లీ కుమారితో పాటు ప్రీతి కుమార్, దుర్గా కుమార్, శశి కుమార్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని లఖిసరాయ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ కుమార్ అన్నారు. నిందితుడు ఆశిష్ చౌదరిగా గుర్తించిన పోలీసులు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story