Tripura Floods: భారీ వర్షాలు.. ఇప్పటివరకు 19 మంది మృతి

by Shamantha N |
Tripura Floods: భారీ వర్షాలు.. ఇప్పటివరకు 19 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో త్రిపుర అతలాకుతలంగా మారింది.దక్షిణ త్రిపురలో మట్టి దిబ్బలతో కుప్పకూలడంతో ఏడుగురు చనిపోయారు. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 19కి చేరింది. మరోవైపు, త్రిపురలోని ఎనిమిది జిల్లాలకు వాతావరణశాఖ 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. వచ్చే రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన హెచ్చరించింది. అగర్తల నుంచి వెళ్లే రైళ్లను రద్దు చేశారు. త్రిపురవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గోమతి, దక్షిణ త్రిపుర సహా పలు ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రంగంలోకి దిగిన వాయుసేన

వరద బాధిత ప్రాంతాలకు సాయం అందించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. రెండు C-130, ఒక AN-32 ఎయిర్‌క్రాఫ్ట్ ల ద్వారా వరద బాధితులకు సాయం అందిస్తున్నారు.వరదప్రాంతాల్లోని వారిని సురక్షితంగా తరలించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు మోహరించారు. ఇకపోతే త్రిపురలోని నదుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. గోమతి, దక్షిణ త్రిపుర, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆ ప్రాంతాల్లో నదులు ప్రమాదకస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. మొత్తం ఎనిమిది జిల్లాల్లో అపారమైన పంట నష్టం జరిగింది. త్రిపుర వ్యాప్తంగా 65,400 మంది నిరాశ్రయులయ్యారు. అక్కడి ప్రభుత్వం ఆగస్టు 19 నుంచి 450 సహాయ శిబిరాలను ప్రారంభించింది. దాదాపు 17 లక్షల మంది వరదబాధితులుగా మారారని అధికారులు పేర్కొన్నారు. 2,032 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, వాటిలో 1,789 ప్రాంతాలని క్లియర్ చేశారు. రోడ్డు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1,952 చోట్ల రోడ్లు కోతకు గురికాగా, ఇప్పటి వరకు 579 ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను పునరుద్ధరించారు.

Advertisement

Next Story

Most Viewed