అలరిస్తున్న నేషనల్‌ ఫ్రెంచ్‌ ఆర్కెస్ట్రా రూపొందించిన ‘టుగెదర్’

by Sujitha Rachapalli |
అలరిస్తున్న నేషనల్‌ ఫ్రెంచ్‌ ఆర్కెస్ట్రా రూపొందించిన ‘టుగెదర్’
X

దిశ వెబ్ డెస్క్ : కరోనా ప్రభావంతో దాదాపు అన్ని దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రపంచంలోని కోట్లాది పౌరులు ఇల్లకే పరిమితం అయ్యారు. చాలా మంది ఇంట్లో ఉంటూ కాస్త బోర్ ఫీల్ అవుతున్నారు. వారిలో ఉత్సాహాన్ని నింపడానికి సినీ తారలు, సెలెబ్రెటీలు, ప్రభుత్వాలు ఏదో ఓ రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో పోలీసులే స్వయంగా వీధుల్లో పాటలు పాడుతూ.. ప్రజల్లో జోష్ నింపారు. అలాగే మన దేశంలో చూసుకుంటూ.. ట్రైలర్లు, ఫస్ట్ లుక్, సినిమా పేర్లు, రివీల్ చేస్తూ సినీ అభిమానులను ఆనంద పరుస్తున్నారు. అంతేకాదు కరోనా పై పాటలు పాడుతూ.. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. పలు భాషల హీరోలందరూ కలిసి ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ ఫిలిం కూడా తీశారు. అలానే ఫ్రాన్స్ లో తమ సంగీతంతో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునే నేషనల్ అర్కెస్ట్రా ఆఫ్ ఫ్రెంచ్ బృందం ‘టుగెదర్ ’ పేరుతో ఓ వీడియో రూపొందించింది. అది యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది.

ఫ్రాన్స్ లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ కూడా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో పాటు, కరోనా వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని చూసి ప్రజల్లో ఒకింత భయం కొనసాగుతోంది. వారిలో దైర్యాన్ని నింపడానికి.. ఎప్పుడూ తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించే నేషనల్‌ ఆర్కెస్ట్రా ఆఫ్‌ ఫ్రెంచ్‌ సభ్యులంతా ఓ వీడియో చేశారు. వాళ్లంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. తమ సంగీతంతో ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకోవడంతో .. దాదాపు 50 మంది ఆర్కెస్ట్రా సభ్యులు ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటూ ఆన్‌లైన్‌లో తమ సంగీతాన్ని ‘టుగెద‌ర్‌ ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే అందులో కొంతమంది సభ్యుల దగ్గర సంగీత వాయిద్యం అందుబాటులో లేక‌పోవ‌డంతో కిచెన్‌లోని వ‌స్తువుల‌ను ఉప‌యోగించి ఈ వీడియోలో పార్టిసిపేట్ చేశారు. ప్ర‌జ‌లు లేనిదే తాము లేమ‌ని, అంతేకాక ఇలాంటి సమ‌యంలో ఒక‌రికొక‌రం ఎంతో అవ‌స‌రం అనేది అర్థ‌మ‌వుతోంద‌న్నారు. అందుకే తాము సంగీతాన్ని పంచుకుంటున్నామని ఓ సంగీత‌కారుడు పేర్కొన్నారు. ఈ వీడియోను చిత్రీక‌రించ‌డానికి నాలుగు రోజులు ప‌ట్టింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ ఈ వీడియో అక్క‌డి జ‌నాల మ‌న‌సుల‌ను క‌దిలిస్తోంది.

Tags : corona virus, lockdown, france, national orchestra of french, together

Advertisement

Next Story

Most Viewed