అరుణగ్రహంపై అందాల ‘డస్ట్ బో’

by Sujitha Rachapalli |
అరుణగ్రహంపై అందాల ‘డస్ట్ బో’
X

దిశ, ఫీచర్స్ : ఏడు వర్ణాలతో విరిసే ఇంద్రచాపం మనకు కొత్త కాదు. కానీ అంగారక గ్రహంపై ‘ఇంద్రధనస్సు’ కనిపిస్తే మాత్రం అదో కొత్త అనుభూతి. మార్స్‌ అధ్యయనం కోసం నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్.. ఆ అద్భుత రెయిన్‌బో చిత్రాన్ని తన కెమెరాలో బంధించింది. ఈ ఫోటోను నాసా తాజాగా విడుదల చేసింది. ప్రకృతిలోని సూర్యకాంతి అనేక లక్షల నీటి బిందువులతో విక్షేపణం చెందడం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుందని తెలిసిందే. కానీ అంగారక గ్రహం చాలా పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అలాంటిది ఇంద్రధనుస్సు ఏర్పడటం అంటే.. అక్కడ కూడా వర్షాలు పడతాయా? అసలు అది ఇంద్రధనస్సేనా? కాదా?

అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. పర్సెవరెన్స్‌’ రోవర్‌‌ను పంపించిన విషయం తెలిసిందే. అది మార్స్‌పై ల్యాండ్ అయిన క్షణం నుంచే.. అక్కడి వాతావరణానికి సంబంధించిన అనేక ఫొటోలను నాసాకు పంపిస్తుండటంతో పాటు ఆ గ్రహానికి చెందిన అనేక రహస్యాలను చేధించేందుకు చకచకా కదులుతోంది. జీవం ఉనికికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తాజాగా మార్స్‌పై ఇంద్రధనుస్సు ఏర్పడటాన్ని గుర్తించింది. దానికి సంబంధించిన ఫోటోను కూడా నాసా కేంద్రానికి పంపించింది. అయితే అంగారకుడిపై తగినంత వర్షపాతం లేకపోవడం, అక్కడంతా పొడి వాతావరణమే ఉండటం మూలాన అది ‘రెయిన్ బో’ కాదని, ‘డస్ట్ బో’ అంటూ విశదీకరిస్తున్నారు. ఎందుకంటే ‘డస్ట్‌బో’ అనేది నీటి బిందువులకు బదులుగా దుమ్ము వల్ల ఏర్పడుతుంది.

Advertisement

Next Story