రేపు పోలవరంలో నారా లోకేష్ పర్యటన

by Anukaran |
lokesh
X

దిశ, ఏపీ బ్యూరో : పోలవరం నిర్వాసిత గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం పర్యటించనున్నారు. ప్రాజెక్టు కోసం త‌మ స‌ర్వ‌ం త్యాగం చేసిన నిర్వాసితులకు ఉండ‌టానికి ఇళ్లు లేక‌, తాగ‌డానికి నీళ్లు లేక ద‌య‌నీయ‌స్థితిలో ఉన్నామంటూ నిర్వాసితులు విలపిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనలు సైతం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో నిర్వాసితులు ప‌డుతున్న ఇబ్బందులు ప‌రిశీలించేందుకు పోల‌వ‌రం నిర్వాసిత గ్రామాల్లో నారా లోకేశ్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భ‌ద్రాచ‌లం చేరుకొని 10.30 గంటల‌కు సీతారామ‌చంద్ర‌మూర్తిని ద‌ర్శించుకుంటారు.

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 1.30 వ‌ర‌కూ తూర్పుగోదావ‌రి జిల్లా కూన‌వ‌రం మండ‌లం టేకుల‌బోరు గ్రామంలో నిర్వాసితుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కూ వీఆర్ పురం మండ‌లం శ్రీరామ‌గిరి గ్రామం కొండ‌పైన నిర్వాసితులు, ఆదివాసీల సమస్యలు తెలుసుకుంటారు. వారికి భరోసా కల్పించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 5.30 గంట‌ల నుంచి చింతూరుకు చేరుకొని నిర్వాసితులతో మాట్లాడ‌తారు. మరుసటి రోజు సెప్టెంబర్ 1న ఉద‌యం మారేడుమిల్లి నుంచి రంప‌చోడ‌వ‌రం చేరుకుని ప్ర‌ధాన కూడ‌లిలో ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి ఉద‌యం 11 గంట‌ల నుంచి 11.30 నిమిషాల వ‌ర‌కూ మాట్లాడ‌తారు.

మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వ‌ర‌కూ దేవీప‌ట్నం మండ‌లం, పెద‌వేంప‌ల్లి గ్రామ నిర్వాసితుల‌తో ముఖాముఖీ, మ‌ధ్యాహ్నం 1.45 నుంచి 2.15 వ‌ర‌కూ దేవీప‌ట్నం మండ‌లం ఇందుకూరు గ్రామ‌ నిర్వాసితుల‌తో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 3 గంట‌ల వ‌ర‌కూ దేవీప‌ట్నం మండ‌లం ముసిరిగుంట గ్రామంలో పోల‌వ‌రం నిర్వాసితుల్ని క‌ష్టాలు అడిగి తెలుసుకుంటారు. మ‌ధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కూ గోక‌వ‌రం మండ‌లం క్రిష్ణునిపాలెంలో నిర్వాసితులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు.

Advertisement

Next Story