17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టండి

by srinivas |
17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టండి
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో లేఖ రాశారు. రాష్ట్రంలో 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై సీఎం దృష్టి సారించాలని లేఖలో కోరారు. వివిధ విశ్వ విద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేసినందుకు విద్యార్థులు తల్లిదండ్రులు గందరగోళంలో పడ్డారని లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాంతం పరీక్షలు ఎంతో ముఖ్యమైనప్పటికీ లక్షల మందికి సామూహికంగా ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదకరమన్నారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ వద్దంటూ కేరళ, కర్ణాటక, తెలంగాణలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు ప్రారంభించినట్లు లేఖలో ప్రస్తావించారు. ఏపీలో అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం జగన్‌ను లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేసినందుకు అభినందనలు తెలిపారు. పరీక్షలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువకి వచ్చిందన్న విషయాన్ని నారా లోకేశ్ లేఖలో ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed