న‘మస్తు’ ట్రంప్!

by Shamantha N |
న‘మస్తు’ ట్రంప్!
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం మస్తు జోరుగా సాగింది. ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ నగరమంతా మోడీ, ట్రంప్‌ల హోర్డింగులతో హోరెత్తింది. మొతేరా స్టేడియానికి ట్రంప్ దంపతులు చేరుకోగానే..ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ‘నమస్తే ట్రంప్’ అంటూ నినదించారు. మోడీ కూడా తన ప్రసంగాన్ని ‘నమస్తే ట్రంప్’ అంటూ..ఆరంభించారు. భారత ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్టు మోడీ చెప్పారు. మోడీ, ట్రంప్‌లిద్దరు కలిసి మొతెరా స్టేడియంలోని ప్రజలకు అభివాదం చేశారు. ట్రంప్ పర్యటనను ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య సహకారం, సాన్నిహిత్యానికి కొత్త శకమని చెప్పారు.

మోడీ ప్రసంగానంతరం పెద్దన్న ట్రంప్ మాట్లాడుతుండటాన్ని ప్రజలు గమనించి చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. భారత్ అవకాశాలకు నెలవనీ, 70 ఏండ్లలో అద్భుతమైన శక్తిగా ఎదిగిందన్న ట్రంప్ వ్యాఖ్యలతో మొతెరా స్టేడియం సందర్శకుల చప్పట్లతో కోలాహలంగా మారింది. అమెరికా అభివృద్ధిలో ఇండో అమెరకన్ల పాత్రను గురించి కూడా ఆయన మాట్లాడారు.భవిష్యత్ కోసం ఇరు దేశాలు ఏకం కావాలంటూ..ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, స్టేడియంలో ‘ఇవాంక ట్రంప్’తో సెల్ఫీ దిగేందుకు సందర్శకులు పోటీపడటం గమనార్హం. తాజ్ వద్ద ‘ట్రంప్’ దంపతుల సందడి..

ప్రపంచ వారసత్వ కేంద్రం, భారత చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌నూ అమెరికా అధ్యక్షులు ట్రంప్ దంపతులు సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ తాజ్ అందాలను వీక్షించారు. ఫొటోలకు ఫోజులిస్తూ అలరించారు. మొతెరా స్టేడియం నుంచి ఆగ్రాకు చేరుకున్న ట్రంప్ దంపతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. వీరికి తాజ్ గొప్పతనాన్ని వివరించేందుకు అధికారులు గైడ్‌ను కేటాయించారు. ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ మహల్ కలియతిరిగారు. వీరికి గైడ్ తాజ్ మహల్ చరిత్ర గురించి వివరించారు. సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు తమ సందేశాన్ని రాశారు. కాసేపటి తర్వాత భర్త కుష్నర్‌తో ఇవాంక ట్రంప్ తాజ్‌ను సందర్శించింది.

Read Also..

ఇండియా టూర్.. హోవర్ టు ట్రంప్?

Advertisement

Next Story

Most Viewed