అధికారిక కార్యక్రమాలకు తప్ప.. వేటికీ అనుమతి లేదు

by Shyam |
అధికారిక కార్యక్రమాలకు తప్ప.. వేటికీ అనుమతి లేదు
X

దిశ, నల్లగొండ: కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న క్రమంలో జిల్లాలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 13, 14ల ప్రకారం కోవిడ్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కొద్ది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా నిరసన కార్యక్రమాలు, దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 నిబంధనలు రాష్ట్రంలో ప్రభుత్వం మరింత పటిష్టంగా అమలు చేస్తున్నదని, అదే సమయంలో ఎక్కడా ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇకపై జిల్లాలో ఎక్కడైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తానని ఆయన హెచ్చరించారు. కేవలం ప్రభుత్యం నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పారు. వివాహాలు, శుభకార్యాలు సైతం కేవలం 50 మందికి మించకుండా వారి వారి ఇండ్లలో పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకొని మాత్రమే నిర్వహించుకోవాలని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. కోవిడ్ నియంత్రణ కోసం ప్రజలంతా పోలీసులతో సహకరించాలని, కరోనా కేసుల సంఖ్య పెరగకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story