సాగర్ ఉపఎన్నిక.. తెలంగాణలో పొలిటికల్ హీట్

by Anukaran |   ( Updated:2021-03-22 11:40:52.0  )
సాగర్ ఉపఎన్నిక.. తెలంగాణలో పొలిటికల్ హీట్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో నెల రోజుల పాటు రాజకీయం రంజుగా మారనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఇంకా చల్లారనే లేదు. ఈలోపే నాగర్జునసాగర్ ఉపఎన్నిక రూపంలో మరో రాజకీయ సమరానికి తెర లేచింది. మండలి ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో అధికార టీఆర్ఎస్ పార్టీ.. దెబ్బతిన్న పులిలా ప్రతిపక్షాలు ప్రతీకారం తీర్చుకోవాలన్న కాంక్షతో ఉన్నాయి. మరి ఈ అవకాశాన్ని ఎవరూ సద్వినియోగం చేసుకుంటారు? ఎవరు ప్రజల మన్ననలు పొందగలుగుతారు? తదితర అంశాలు.. ఉపఎన్నిక నోటిఫికేషన్‌పై ‘దిశ’ ప్రత్యేక కథనం.

నాగార్జున సాగర్ ఉపఎన్నిక అంశం నోముల నర్సింహయ్య దశదినకర్మ ముగిసిన రెండుమూడు రోజుల నుంచే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారం బాటపట్టాయి. అయితే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు అన్నీ పార్టీలు సాగర్ ఉపఎన్నిక ప్రచారానికి బ్రేక్ ఇచ్చాయి. తాజాగా మంగళవారం నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో తిరిగి ప్రచార అస్త్రాలను తెరపైకి తీసుకొచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నుంచి ఎవ్వరికీ వారుగా ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మినహా ఏ పార్టీ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నాయి.

టీఆర్ఎస్ తీరు ఇలా..

సాగర్ ఉపఎన్నిక అభ్యర్థిత్వం ఖరారు విషయంలో టీఆర్ఎస్ అధిష్ఠానం నాన్చుతూ వస్తోంది. ఓవైపు అభ్యర్థిత్వం కోసం ఆశావాహుల లిస్ట్ చాంతాడంత పెరిగినా.. నేతలు ఎవ్వరికీ వారు ప్రచారం చేసుకుంటున్నా.. అధిష్ఠానం మాత్రం మౌనమే వహించింది. హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ పెట్టి వరాల జల్లు సైతం కురిపించారు. ఆ రోజు కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. మండలి ఎన్నికల్లో ఫలితాలను బట్టి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని అధిష్ఠానం భావించింది. ఫలితాల అనుకూలత ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనుకుంది.

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగరేయడంతో ఏ అభ్యర్థిని పెట్టినా విజయం సాధిస్తామనే ధీమాతో అధిష్ఠానం ఉంది. అయితే మండలి ఎన్నికలకు ముందు సాగర్ ఉపఎన్నిక కోసం రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అసలు నోముల కుటుంబాన్ని పక్కనపెట్టారన్న ప్రచారం లేకపోలేదు. కానీ ఇటీవల నర్సింహయ్య కొడుకు భగత్‌కే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దుబ్బాకలో ఒక న్యాయం.. ఇక్కడ ఒక న్యాయమా? కచ్చితంగా టికెట్ నోముల కుటుంబానికే దక్కుతుందని కొందరు నేతలు ఆశిస్తున్నారు.

బీజేపీ ప్లాన్ ఏంటంటే..

సాగర్‌లో ఏలాగైనా విజయం సాధించాలనే ధీమాతో బీజేపీ పావులు కదుపుతోంది. క్షేత్రస్థాయిలో తమకే టికెట్ దక్కుతుందని ఎంతమంది నేతలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నా బీజేపీ నాయకత్వం మాత్రం జాగ్రత్తగా అడుగులేస్తోంది. మొదటగా టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశాకే.. వారి బలాబలాల ఆధారంగా బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. మండలి ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూసినా పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరఫున మహిళా సదస్సు, గిరిజన పోరుయాత్ర, గొర్రెల కాపరులు సంఘాలు, మరికొన్ని కులసంఘాలతోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. దీనికి అనుగుణంగానే బీజేపీ నుంచి ఆయా సామాజిక వర్గాల వారీగా టికెట్ ఆశావాహులు ప్రత్యేక ప్రోగ్రామ్స్ చేసుకుంటుండడం గమనార్హం.

నేడే నోటిఫకేషన్

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు సంబంధించి మంగళవారం ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మిర్యాలగూడ ఆర్డీఓ, రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ ఆ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. మరుసటి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. మార్చి 30న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా, 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఉపఎన్నికలో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించనున్నారు. ఇదిలావుంటే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2,16,983 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Next Story