సాగర్​ సమరంలో నిలిచేదెవ్వరు?

by Anukaran |   ( Updated:2021-01-11 04:44:22.0  )
సాగర్​ సమరంలో నిలిచేదెవ్వరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్​ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బీజేపీ, టీఆర్​ఎస్​ నుంచి ఎవరు పోటీకి దిగుతారో ఇంకా తేలడం లేదు. ఈ రెండు పార్టీలు సాగర్​ను సవాల్​గా తీసుకుంటున్నాయి. బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నాయి. ముందుగా అభ్యర్థిని ఎవరు ప్రకటిస్తారనే అనే దానిపైనే సందిగ్థత నెలకొంది. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అనే తీరుగా రెండు పార్టీలూ వ్యవహరిస్తున్నాయి. ఉప ఎన్నికను మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

బీజేపీ బీసీవాదాన్నే బలంగా తీసుకుంటోంది. టీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో సాగర్​లో ఉప ఎన్నిక జరుగనుంది. ఇక్కడ తొలి నుంచి రెడ్డివర్గానిదే అధిపత్యం కొనసాగినా గత ఎన్నికలలో బీసీవర్గానికి చెందిన నోముల గెలిచారు. నియోజకవర్గంలో సుమారు 55 వేల ఓట్లకుపైగా ఉన్న యాదవులు నోములను ఒక్కతాటిపై ఉండి గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీసీ నినాదంతోనే పోటీకి దిగాలని భావిస్తోంది. ఇప్పటికే తొలిదఫా సర్వేను కూడా చేయించుకుంది. సర్వేలో కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. 2018లో రెండు వేల ఓట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి గెలుపు అంచున ఉంటుందనుకుంటున్నారు. అందుకే టీడీపీ నుంచి గతంలో పోటీ చేసిన అంజయ్య యాదవ్​ను మాజీ ఎంపీ గరికపాటి మోహన్​రావు సహకారంతో బీజేపీ దగ్గర పెట్టుకుంది.

టీఆర్​ఎస్ వెయిటింగ్​

దుబ్బాక ఎన్నికలో ఘోరంగా దెబ్బతిని, గ్రేటర్​లో చావుతప్పి కన్ను లొట్టపోయిన అధికార పార్టీ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగుతోంది. ఇంటెలిజెన్స్​ సర్వేను నమ్ముకోలేక ప్రైవేట్​ సంస్థలకు బాధ్యతలను అప్పగిస్తోంది. మంత్రి కేటీఆర్​ బృందం ఇప్పటికే పూర్తి చేసిన సర్వేలో కొంత వ్యతిరేకత కనిపించింది. రైతుల విషయంలో యూటర్న్ తీసుకోవడం​ పార్టీని మరింత ప్రమాదంలోకి నెడుతుందేమోనని అనుమానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో తమ అభ్యర్థి గెలువడం కష్టమేనని భావిస్తోంది.

ఎన్నికల వరకు పరిస్థితులను అనుకూలంగా మల్చుకోవాలనే ఎత్తుగడలు వేస్తోంది. నోముల స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలా అని మల్లగుల్లాలు పడుతోంది. నోముల కుటుంబానికి టికెట్​ ఇవ్వాలనుకుంటున్నా కలిసి రావడం కష్టమేనని భావిస్తోంది. రాజకీయాలలో నోముల కుటుంబం యాక్టివ్​గా లేదు. దుబ్బాకలో ఇలాగే సాహసం చేసి దెబ్బతింది. అనూహ్యంగా పాతవర్గాలు బయటకు వస్తున్నాయి. జానారెడ్డికి గురి పెట్టారు. కాంగ్రెస్​ ముందుగానే మేలుకొని బ్రేక్​ వేసింది. దీంతో టీఆర్​ఎస్​ పాత కాపులను వెతుకుతోంది. నోములతో రాజకీయ వైరం ఉన్న తేరా చిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు. నోముల వర్గం వ్యతిరేకిస్తోంది. గుత్తాను నిలబెడితే గెలుపు సాధ్యమవుతుందా అనే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.

ఎవరు ముందు ప్రకటిస్తారు?

టీఆర్​ఎస్​ కూడా బీసీ నేత కోసం వెతుకుతోంది. బీజేపీ, టీఆర్​ఎస్​ నుంచి అభ్యర్థిని ఎవరు ముందు ప్రకటిస్తారనే అంశంమే కీలకంగా మారింది. బీజేపీ అంజయ్య యాదవ్​కు టికెట్​ ఇస్తే టీఆర్​ఎస్​ రెడ్డి వర్గాన్నే దింపుతుంది. పరిణామాలు ఎలా ఉన్నా బీజేపీ బీసీ నినాదాన్ని తీవ్రంగా ప్రచారం చేసుకోనుంది. టీఆర్​ఎస్​ బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే బీజేపీ స్టాండ్​ మారనుంది. పోటీ కోసం బారులు తీరినవారిలో ఒక రెడ్డినే పోటీకి దింపనుంది. టీఆర్​ఎస్​కు ఇప్పటికిప్పుడు బీసీ అభ్యర్థి దొరకడం కష్టమే. అంజయ్య యాదవ్​కు గాలం వేయాల్సిందే. ఇప్పటికే అంజయ్య యాదవ్​ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఓ నేతను రాయబారిగా దింపుతోందని తెలుస్తోంది. అంజయ్య యాదవ్​కు బీజేపీ నుంచి అనుకూలత వస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోముల కుమారుడో, ఆయన కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి టికెట్​ ఇచ్చే ప్లాన్​ కూడా చేస్తోంది. కేవలం సానుభూతి అంశంపై వెళ్తే పరాజయం తప్పదని కూడా భావిస్తున్నారు.

ప్రధాన ప్రచారం అదే

నోములను రెడ్డివర్గాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశాయనేది ఈ సెగ్మెంట్​లో ఉన్న ప్రచారమే. దీనినే అనుకూలంగా మల్చుకోవాలని బీజేపీ చూస్తోంది. నోముల అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడే రెడ్డి వర్గం చనిపోయాడంటూ ప్రచారం చేసింది. నోముల వర్గాన్ని భయపెట్టింది. కోలుకోవడం కష్టమేనని, మాదే అంతా అంటూ బెదిరింపులకు దిగింది. నోముల మృతికి రెడ్డివర్గం ఒత్తిళ్లే కారణమని, బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే నినాదాన్నే బీజేపీ ప్రచారాస్త్రంగా తీసుకుంటుందని పార్టీ నేతలు చెప్పుతున్నారు. టీఆర్​ఎస్​ కూడా బీసీ అభ్యర్థికి టికెట్​ ఇస్తే వ్యతిరేకవర్గాన్ని ఎలా కంట్రోల్​ చేయాలనేది కూడా ప్రధానమే. నోముల అణగదొక్కాడని రెడ్డివర్గం మొత్తం ఆరోపణలు చేస్తోంది. అధికారపార్టీ నుంచి రెడ్డివర్గానికి టికెట్​ ఇస్తే గెలిపించుకుంటామని అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు.

వచ్చేనెలలో నోటిఫికేషన్​..?

సాగర్​ ఉప ఎన్నికకు వచ్చేనెలలో నోటిఫికేషన్​ వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. సాగర్​ ఉప ఎన్నిక తర్వాతే వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికలకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఇక్కడ టీఆర్​ఎస్​ గెలిస్తే వాటిపై ప్రభావం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్​ గెలిచినా అదే పరిస్థితి. అందుకే పార్టీలు సాగర్​ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నాయి. టీఆర్​ఎస్​ అధిష్టానం ఇక్కడే దృష్టి పెట్టింది. కేసీఆర్​ స్వయంగా రంగంలోకి దిగుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గాన్ని మొత్తం ఇక్కడే ఉంచి, సీఎం కేసీఆర్​ ప్లాన్​ వేస్తారని, సీఎం పర్యవేక్షణలోనే ఉప ఎన్నికల్లో పోటీ ఉంటుందని అంటున్నారు. బీజేపీ ఉత్సాహంతో ఉంది. దుబ్బాక, గ్రేటర్​ హైదరాబాద్​లో విజయంతో ప్రత్యమ్నాయం మేమేనంటూ ధీమాతో ఉంది. ఈసారి కూడా కేంద్రమంత్రులు, ఢిల్లీ పెద్దలను తీసుకురావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్​ కూడా చాలా ఆశతో ఉంది. చాలా రోజుల తర్వాత ఉప ఎన్నికలో గెలిచేందుకు అవకాశాలున్నాయనుకుంటోంది. జానారెడ్డి గెలుస్తారనే ధీమాతో టీపీసీసీ చీఫ్​ ఎంపికనే వాయిదా వేసింది.

Advertisement

Next Story