బ్రేకింగ్.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ రిలీజ్

by Shyam |   ( Updated:2021-03-16 06:47:12.0  )
బ్రేకింగ్.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానంతో పాటు, సాగర్ అసెంబ్లీ స్థానానికి ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేసింది. సాగర్ ఉపఎన్నికకు ఈనెల 23 నుంచి 30వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండగా, ఉపసంహరణకు ఏప్రిల్ 3ను గడువు తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 17న ఎన్నిక అనంతరం మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ ప్రకటించింది.

ఉపఎన్నికకు సంబంధించి తాజా ప్రకటన వెలువడటంతో రాష్ట్రంలోని పొలిటికల్ పార్టీలు అభ్యర్థుల గెలుపు కోసం కసరత్తులు మొదలుపెట్టనున్నాయి. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి మరణాంతరం రాష్ట్రంలో మొదటి ఉపఎన్నిక జరగగా, అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య అకాల మరణాంతరం సాగర్ నియోజకవర్గానికి రెండోసారి ఉపఎన్నిక అనివార్యమైంది.

దుబ్బాకలో గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ ఎగరేసుకుపోగా, ఈసారి ఎలాగైనా కాపాడుకోవాలని శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సాగర్‌‌ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లురుతోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీలో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన కమలనాథులు ఈసారి కూడా అదే పంథా కొనసాగించి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఫిక్స్ అయిపోవాలని భావిస్తున్నారు. సాగర్ నియోజకవర్గం ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా లాస్ట్ టైం దానిని టీఆర్ఎస్ బద్దలు కొట్టింది. గతంలో అక్కడ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి వరుసగా గెలుపొందడమే కాకుండా, మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలంటే జానారెడ్డిని మళ్లీ రంగంలోకి దింపేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక అధికార టీఆర్ఎస్, బీజేపీ నుంచి అభ్యర్థులు ఖరారు కాలేదు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

Advertisement

Next Story