రేపే ఓట్ల లెక్కింపు.. గెలుపెవరిదో!

by Shyam |
రేపే ఓట్ల లెక్కింపు.. గెలుపెవరిదో!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. వీటితో పాటు అనివార్య కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన నల్లగొండ, పరకాల, బోధన్, గజ్వేల్, జీహెచ్ఎంసీ పరధిలోని లింగోజిగూడలోని ఒక్కొక్క వార్డుకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీంతో గెలిచేదెవరో, ఓడేదెవరోనని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ సమర్పించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. మాస్క్ లేకున్నా ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. మినీ పుర పోరులో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు గాను మొత్తం 69.77 శాతం పోలింగ్ నమోదైంది. ఇతర కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన పలు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 68.71 శాతం పోలింగ్ నమోదైంది.

అభ్యర్థుల్లో గెలుపు ధీమా

మినీ పురపోరులో 248 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1307 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 వార్డులకు 502 మంది ఉండగా 238 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులకు ఒక వార్డు ఏకగ్రీవమైంది. కాగా 250 మంది బరిలో నిలిచారు. అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు 66 మంది, సిద్దిపేట 43 వార్డులకు 236 మంది, నకిరేకల్ 20 వార్డులకు 93 మంది, జడ్చర్ల 27 వార్డులకు 112 మంది, కొత్తూరు 12 వార్డులకు 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే గెలుపు ఎవరిని వరిస్తుందోనని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోలోపల టెన్షన్ ఉన్నా పైకి మాత్రం ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

శానిటైజేషన్ చేశాకే కౌంటింగ్

స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులకు శానిటైజేషన్ నిర్వహించాకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొవిడ్ కారణంగా సామాజిక దూరం పాటించేందుకు వీలుగా విశాలమైన గదుల్లో కౌంటింగ్ ను చేపట్టనున్నారు. ఆ గదులను కూడా శానిటైజ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ప్రతి టేబుల్ వద్ద ఒక శానిటైజర్ బాటిల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టేబుల్ కు ఇద్దరు కౌంటింగ్ సిబ్బంది, ఒక సూపర్ వైజర్, వార్డుకు ఆర్ వో, ఏఆర్ వో ఉంటారు.

నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి

కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో లెక్కింపునకు హాజరయ్యే సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ రిపోర్ట్ సమర్పించాలని ఎస్ఈసీ ఆదేశించింది. నెగెటివ్ ఉంటేనే అనుమతించాలని, పాజిటివ్ ఉంటే సిబ్బందిని రిప్లేస్ చేయాలని అధికారులకు ఇప్పటికే సూచించింది. ఇప్పటికే కొవిడ్ పరీక్షలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా సిబ్బందికి మాస్కులు, ఫేస్ షీల్డులు అందించాలని ఎస్ఈసీ ఆదేశించింది. లెక్కింపు గదుల్లో దూరం పాటించేలా చర్యలు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అవసరానికి తగినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు.

కేంద్రాల వద్ద 144 సెక్షన్

కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. కరోనా కేసులు మరింత పెరుగుతున్న క్రమంలో రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలకు కౌంటింగ్ కేంద్రాల వద్ద అనుమతిపై ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం తీసుకునేందుకు గెలిచిన అభ్యర్థితో పాటు మరొకరికి మాత్రమే అనుమతించనున్నారు. విజయోత్సవ ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించారు. నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఈసీ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story